Nara Lokesh: భక్త కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

Nara Lokesh: భక్త కనకదాసు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ఐటీ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 538వ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించారు. 9 అడుగుల ఎత్తైన కంచు విగ్రహాన్ని మంత్రి ముఖ్యఅతిధిగా ఆవిష్కరించగా, వేలాది మంది ప్రజలు, ప్రముఖులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా భక్త కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రతి జిల్లాలో ఘనంగా జరిపారు. భక్త కనకదాసు సామాజిక సంస్కరణకు, సర్వ సమానత్వానికి ప్రతీకగా నిలిచారు. ఆయన రచనల ద్వారా సమాజంలో ఉన్న అన్యాయం, కుల వివక్షను ప్రశ్నించి, సామాజిక చైతన్యాన్ని కలిగించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం ద్వారా ఆయన తత్త్వాన్ని, సమానత్వాన్ని, సమాజ హితాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.



