ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

Vaikuntha Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. విష్ణుమూర్తి దర్శనం కోసం భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతున్నారు.పెద్దసంఖ్యలో తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అలయ నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమలకు వెళ్లలేని భక్తులు, స్థానిక ఆలయాలకు చేరుకుని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటున్నారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. జిల్లాలో ఉన్న దేవాలయాల్లో ఉత్తర ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులు ఎక్కడ ఇటువంటి ఇబ్బందులు పడకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

దేవతలంతా మహావిష్ణువను సేవించడానికి తరలివచ్చే తిథి ముక్కోటి ఏకాదశి. దీన్నే వైకుంట ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఉత్తర ద్వారం ద్వారా ఆ మహావిష్ణు రూపాన్ని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకోవడం ద్వారా ముక్కోటి దేవతలను దర్శించుకున్న మోక్షం లభిస్తుందని, పూజారులు చెబుతున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.

Asifabad: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వాడ శ్రీ కేశవ నాథ్ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి విశేష పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు ఆలయ అర్చకులు.

ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. అనంతరం స్వామి వారినీ ప్రధాన విధుల గుండా ఊరేగింపు నిర్వహించి ఆలయానికి తీసుకొని వచ్చారు.. ఉదయం 6 గంటల నుండే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరు జగన్నాథ ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయం తర్వాత రెండోదిగా పేరొందింది. పూరిలోని ఆలయం మాదిరిగానే ఇక్కడా పూజలు నిర్వహించడం విశేషం. ఇక ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోదాదేవి రంగనాథస్వామి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ.

Suryapet: సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవోపెతంగా జరిగాయి. వేకువ జామున నుంచి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

Palnadu: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పట్టణంలోని నరసింహస్వామి, శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు వచ్చిన భక్తుల ప్రత్యేక దీపాలు వెలగించి పూజలు చేశారు భక్తులు. అనంతరం స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు.

Hyderabad: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని హైదరాబాద్ శేరిలింగంపల్లి పరిధిలోని మియాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు బారులు తీరారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉత్తర ద్వారం ద్వారా ఆ స్వామివారిని దర్శించుకుంటే స్వర్గవాస ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

Hyderabad: హైదరాబాద్ కుత్బుల్లాపూర్ గోదావరి హమ్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పుర్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలన్ని గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి.

Jagtial: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే అంజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీఓ మధుసూదన్లు అంజన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో భద్రత, క్యూలైన్ నిర్వహణ, ప్రసాద వితరణ తదితర ఏర్పాట్లను అధికారులు పకడ్బందీగా చేపట్టారు.

Srikakulam: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మార్గశిర శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార ప్రవేశం జరిగితే సకల పాపాలు పోయి శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.

Sangareddy: సంగారెడ్డి జిల్లా ఆందోల్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ భూనీల సమేత రంగనాథ స్వామి ఆలయంలో వేదమంత్రోత్సవాల నడుమ ఉత్తర ద్వారా దర్శనాన్ని తెరిచారు ఆలయ అర్చకులు. ముందుగా ఆలయ ఉత్తర ద్వారం వద్ద పూజలు నిర్వహించిన అర్చకులు, ఉత్తర ద్వారం ప్రారంభించిన అనంతరం.. శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.

Kakinada: కాకినాడ జిల్లాలో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వారం దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కాకినాడలోని శ్రీ భవనారాయణ స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భక్తులు.

Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న గణపతి దేవుడికి, శ్రీ ఆంజనేయస్వామికి పూజలు చేశారు భక్తులు. లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి ఉండడంతో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

Hyderabad: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ సంతోష్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కొత్తపేట వాసవి కాలనీ లోని అష్టలక్ష్మి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని అన్ని ప్రముఖ దేవాలయాలలో భక్తులకు ఉత్తర ద్వారం దర్శనం కల్పించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలలో పాల్గొన్నారు.

దేవాలయాలను సుందరంగా అలంకరించగా, స్వామివారి ఉత్తర ద్వారం దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో క్రమబద్ధంగా నిలబడ్డారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛంద సేవకులు, పోలీసుల సహకారంతో దర్శనాలు సజావుగా కొనసాగాయి. వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కలగడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందనే నమ్మకంతో భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button