షారుఖ్, దీపికపై ఎఫ్ఐఆర్

బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెలపై రాజస్థాన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. హ్యుందాయ్ కారు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న వీరిపై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ గొడవ వెనుక అసలు కథేంటి? కన్స్యూమర్ లాతో ఈ ఇష్యూ ఎలా ముడిపడింది? పూర్తి వివరాలేంటో చూద్దాం!
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో హ్యుందాయ్ కారు కొనుగోలు చేసిన కీర్తి సింగ్ అనే లాయర్, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెలపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 2022లో కొన్న హ్యుందాయ్ అల్కాజర్ కారులో తీవ్ర సాంకేతిక లోపాలున్నాయని, ఈ కారును షారుఖ్, దీపికా ప్రమోట్ చేసిన ప్రకటనల వల్లే కొన్నానని ఆయన ఆరోపించారు. కారులో వైబ్రేషన్స్, యాక్సిలరేషన్ సమస్యలు, హెచ్చరిక సంకేతాలు వస్తున్నాయని, డీలర్‌షిప్, హ్యుందాయ్ సంస్థ సమస్యను పరిష్కరించలేదని ఫిర్యాదు చేశారు.
కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం, తప్పుడు ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్లు కూడా బాధ్యత వహించాలనేది ఆయన వాదన. ఈ ఎఫ్ఐఆర్‌లో హ్యుందాయ్ ఎండీ అన్సూ కిమ్, సీఓఓ తరుణ్ గార్గ్‌తో పాటు డీలర్‌షిప్ డైరెక్టర్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.



