Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

Karthika Pournami: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి..దీపాలు వదిలారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గర్భాలయంలో స్వామి వారికి మారేడు దళాలు సమర్పించి సాముహిక అభిషేకాలు,విశేష పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మారుమోగింది.భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు.
Warangal:
కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ అందంగా అలంకరించారు. ఉదయం నుండే భక్తులు కుటుంబ సమేతంగా దేవాలయాలకు వచ్చి కార్తీకదీపం వెలిగించి, అర్చనలు అభిషేకాలు చేస్తున్నారు.
Nalgonda:
నల్లగొండ జిల్లా చెర్వుగట్టు గుట్టపై కార్తీక పౌర్ణమి సంతరించుకుంది. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో చెర్వుగట్టు మార్మోగుతుంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని పవిత్ర కార్తీక దీపాలను వెలిగించి పూజలు నిర్వహించుకుంటున్నారు.
Karimnagar:
కార్తీక మాసం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివుని ఆలయాల్లో దీపారాధన చేస్తున్నారు.
Khammam:
ఖమ్మం జిల్లా మధిరలో శైవ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. శ్రీమృత్యుంజయ గంగా పార్వతీదేవి అమ్మవారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యం స్నానాలు ఆచరించి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దేవాలయం ఎదుట దీపాలు వెలిగించి శ్రీ మృత్యుంజయ స్వామి గంగ పార్వతి దేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. దేవాలయలో హర హర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలు మారుమ్రోగుతున్నాయి.
Rajashekar Colony:
శ్రీ మహాకాళేశ్వర స్వామి సహిత బంగారు మైసమ్మ దేవాలయం బోడుప్పల్ రాజశేఖర్ కాలనీ లో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారు అమర్నాధేశ్వర స్వామి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా అలంకరణ చేశామని ఆలయ పూజారి సుమంత్ శర్మ తెలిపారు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మహా లింగార్చన, జ్యోతిర్లింగార్చన, దీపారాధన, సేవలతోపాటు నిత్య పూజలు జరుగుతాయని అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలోవిచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారని కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ దీపారాధన చేసినట్లయితే వాళ్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పూజారి సుమన్ శర్మ తెలిపారు.
West Godavari:
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి కావడంతో సందర్భంగా భక్తులు భారీగా పోటెత్తారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని, అమ్మవారిని దర్శించి 365 వత్తుల దీపారాధన, సాల గ్రామ దానాలు చేస్తే సకల కోర్కెలు నెరవేరుతాయినీ ఆలయ ఈవో తెలిపారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఈవో తెలియజేశారు.
Tirupati:
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిశాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి, దీపారాధన చేసి, స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక పౌర్ణమి దృష్ట్యా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Vemulawada:
కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునుండే రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది.దేవాలయం ముందు రావి చెట్టు వద్ద మహిళలు, భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల ఆర్జిత సేవలు, కోడె మొక్కలు, నిత్య కళ్యాణాలు భక్తులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.



