అంతర్జాతీయం

Israeli Hostages: రెండేళ్ల తర్వాత విముక్తి.. బందీలను విడుదల చేసిన హమాస్‌

Israeli Hostages: రెండేళ్లుగా హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న వారికివిముక్తి లభించింది. తొలి దశలో భాగంగా ఏడుగురు బందీలను రెడ్‌క్రాస్‌కు హమాస్‌ అప్పగించింది. ఖాన్‌ యూనిస్‌ నుంచి వారిని తీసుకుని రెడ్‌క్రాస్‌ వాహనశ్రేణి ఇజ్రాయెల్‌కు బయల్దేరింది. బందీలు విడుదలవడంతో వారి కుటుంబసభ్యులు, శ్రేయాభిలాషుల్లో సంతోషం నెలకొంది. మిగతా బందీలను కూడా హమాస్‌ విడిచిపెట్టనుంది.

ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్‌ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలిదశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్‌ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించింది. శుక్రవారం నుంచే ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే బందీల విడుదల సోమవారం ప్రారంభమైంది.

2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి, 251 మందిని హమాస్‌ అపహరించిన సంగతి తెలిసిందే. వారిలో కొంతమందిని గతంలో విడుదల చేసింది. కొందరిని ఇజ్రాయెల్‌ సైన్యం రక్షించింది. మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలినవారిని హమాస్‌ ఇప్పుడు విడిచిపెడుతోంది. ఈ విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్‌ శాంతి ప్రణాళికలో రెండో దశపై చర్చలు ప్రారంభమవుతాయి. ఇందులో హమాస్‌ ఆయుధాలను త్యజించడం గాజా నుంచి ఇజ్రాయెల్‌ దళాల ఉపసంహరణ ప్రధాన అంశాలు.

ఈ చర్చలకు అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారం ఇజ్రాయెల్, ఈజిప్టులలో పర్యటించనున్నారు. తొలుత ఆయన జెరూసలెంలో ఇజ్రాయెల్‌ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు. బందీల కుటుంబసభ్యులను కలుస్తారు. అక్కడి నుంచి ఈజిప్టు వెళతారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button