Hyderabad: న్యూఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు

Hyderabad: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరవాసులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి నగరవ్యాప్తంగా 120కి పైగా కీలక ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ తనిఖీలు కేవలం నేటితోనే కాకుండా జనవరి మొదటి వారం అంతా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ జరిమానా విధించడమే కాకుండా వాహనాన్ని సీజ్ చేయడం, కోర్టు ద్వారా జైలు శిక్ష విధించడం, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ప్రజలు బాధ్యతగా ప్రవర్తించి సురక్షితంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



