కామారెడ్డి జిల్లాను కకావికలం చేసిన భారీ వర్షాలు

Kamareddy: భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాను కకావికలం చేసింది. కామారెడ్డి పట్టణంతోపాటు రాజంపేట, భిక్కనూరు, దోమకొండ మండలాల్లో జనజీవనం స్తంభించింది. రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామంలో 24 గంటల్లో అత్యధికంగా 44 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని మండలాల్లో 20 సెంటి మీటర్ల మేర వర్షం కురిసింది. కామారెడ్డి పట్టణంలోని పెద్దచెరువు అలుగు ఉద్ధృతంగా ప్రవహించడంతో హైదరాబాద్కు వెళ్లే మార్గంలోని పైవంతెన మీది నుంచి నీరు ప్రవహించింది.
సిరిసిల్ల మార్గంతోపాటు నిజాంసాగర్ మార్గంలోనూ రోడ్లు ధ్వంసమవడంతో పట్టణానికి మూడు వైపులా రాకపోకలకు ఆటంకం కలిగింది. పెద్దచెరువు అలుగుతో కిందనున్న జీఆర్ కాలనీలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. పదుల సంఖ్యలో కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి.
భిక్కనూరు- తలమడ్ల స్టేషన్ల మధ్యలో రామేశ్వరపల్లి గ్రామశివారులో వరద ఉద్ధృతికి రైల్వేకట్ట తెగింది. రైల్వేట్రాక్ కింద కంకర, మట్టి కొట్టుకుపోయాయి. దీంతో నిజామాబాద్-హైదరాబాద్ మార్గంలో రైళ్లు నిలిచాయి. జాతీయ రహదారి 44పై భిక్కనూరు టోల్గేట్ వద్ద ఎడ్లకట్ట వాగు ప్రవాహం చేరడంతో పాక్షికంగా రోడ్డు దెబ్బతింది.
భిక్కనూరు వద్ద రహదారిపై 20 కిలో మీటర్లకు పైగా వాహనాలు గంటల తరబడి నిలిచాయి. అధికారులు వారికి ఆహారంతోపాటు తాగునీరు సమకూర్చారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి వద్ద నిజామాబాద్ వెళ్లే మార్గంలో జాతీయ రహదారి కుంగిపోయింది. టేక్రియాల్ వద్ద పెద్దచెరువు ప్రవాహంతో ఒకవైపు మొత్తం జాతీయ రహదారి కుంగింది. జిల్లావ్యాప్తంగా 130 రోడ్లు ధ్వంసమయ్యాయి.



