Air Pollution: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు అంతరాయం

Air Pollution: ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేసి నగర జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. విజిబులిటీ పడిపోవడంతో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. రోడ్లపై వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
కాలుష్యానికి పొగమంచు కూడా తోడవడంతో ఢిల్లీలో వాయు నాణ్యత మరింత దిగజారింది. AQI తీవ్రత 500 పాయింట్లతో ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ సమస్యలు, కంటి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు హైబ్రిడ్ మోడ్‌లో కొనసాగుతున్నాయి. కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం గ్రాఫ్ 4 నిబంధనలు అమలు చేస్తోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో 50 శాతం సిబ్బంది వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు నిర్మాణ పనులపై సంపూర్ణ నిషేధం విధించారు.
నగరంలో డీజిల్ వాహనాలకు ప్రవేశం నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, వాహనాలు నడిపేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరో వైపు పొగ మంచు కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటన ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జాప్యం నెలకొంది. దట్టమైన పొగమంచు దేశ రాజధాని ఢిల్లీని కమ్మేయడంతో ఆయన ప్రయాణించాల్సిన విమానం టేకాఫ్ ఆలస్యమైంది.
షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోడీ జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటన కోసం ఉదయం 8:30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే విమానాశ్రయంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రధాని పర్యటన ఆలస్యమైంది.
మరోవైపు ఈ పొగమంచు ప్రభావం కేవలం ప్రధాని పర్యటనపైనే కాకుండా ఢిల్లీ విమానాశ్రయంలోని సాధారణ విమాన సర్వీసులపై కూడా తీవ్రంగా పడింది. ఉదయం నుంచి పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇండిగో, ఎయిరిండియా వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు జారీ చేశాయి. పలు విమానాలను రద్దు చేస్తున్నామని, మరికొన్ని ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించాయి. ప్రయాణికులు తమ విమానాల స్టేటస్‌ను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లలో చూసుకోవాలని సూచించాయి.



