ఇవాళ బిహార్, పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోడీ పర్యటన

నేడు ప్రధాని నరేంద్ర మోడీ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా రెండు రాష్ట్రాల్లో 18 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. బీహార్‌లో 13 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను, పశ్చిమ బెంగాల్లో 5 వేల 200 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. బీహార్ పర్యటన సందర్భంగా రెండు రైళ్లను ప్రారంభిస్తారు. గయ, ఢిల్లీల మధ్య తిరిగే అమ్రిత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును.. వైశాలి, కోధర్మల మధ్య తిరిగే బుద్ధిస్ట్ సర్క్యూట్ ట్రైన్‌ను మోడీ ప్రారంభిస్తారు.
ఎన్‌హెచ్ 31పై 8.15 కిలోమీటర్ల పొడవైన ఆంటా – సిమారియా బ్రిడ్జిని, గంగానదిపై 1.86 కిలోమీటర్ల ఆరు లైన్ల బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభిస్తారు. గంగానదిపై ఆరు లైన్ల బ్రిడ్జి కారణంగా మొకామా నుంచి బెగుసరాయ్‌కి డైరెక్ట్ కనెక్టివిటీ ఏర్పడనుంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా నిర్మితమైన మెట్రో ట్రైన్ సర్వీసులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 4.15 గంటలకు మెట్రో సర్వీసును ప్రారంభిస్తారు. అంతేకాదు జెస్సోర్ రోడ్ నుంచి జై హింద్ భీమన్బందర్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలులో ప్రయాణిస్తారు.



