Hit 3: హిట్ 3 నుంచి 'ప్రేమ వెల్లువ' సాంగ్ రిలీజ్

Hit 3: నాని నటిస్తున్న హిట్ 3 సినిమా అంచనాలను పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో ఆసక్తి పెరిగింది. అర్జున్ సర్కార్ పాత్రలో నాని వైల్డ్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు ఓ క్లారిటీ ఇచ్చేశారు. మే 1న ఈ చిత్రం విడుదల కానుండటంతో, మేకర్స్ ప్రమోషన్లలో వేగం పెంచారు.
ఇందులో భాగంగా తొలి పాట ‘ప్రేమ వెల్లువ’ని విడుదల చేశారు. ఈ పాట ఓ క్లాసిక్ అనిపించేలా ఉంది. ముఖ్యంగా అంతటి వైల్డ్ ఆఫీసర్ లో ఇంతటి ప్రేమికుడు కూడా ఉన్నాడా అనే ఫీలింగ్ కలిగేలా ఈ సాంగ్ ఉంది. మిక్కీ జే మేయర్ మెలోడీ ట్రాక్ లో సిద్ శ్రీరాం తన గానంతో మరోసారి మాయ చేశాడు. గాయని నూతన మోహన్ గళం కూడా అద్భుతంగా కలిసి వచ్చింది.
ఈ ఇద్దరి కలయిక ఈ పాటను మరింత భావోద్వేగంగా మలిచింది. కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ సాధారణ ఆడియెన్స్ కు కూడా వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. పాటకు అసలైన హైలైట్ నాని – శ్రీనిధి శెట్టి మధ్య కెమిస్ట్రీ. చాలా సున్నితంగా, సహజంగా దర్శకుడు సైలేష్ కొలను ఈ లవ్ ట్రాక్‌ను డిజైన్ చేశాడు. పాటను చూస్తుంటే హిట్ లాంటి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో ఈ ప్రేమకథ ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ టచ్ ని అందించనుందనే అభిప్రాయం కలుగుతోంది.