జాబిల్లిపై ఫోకస్ చేసిన ప్రపంచ దేశాలు

అకస్మాత్తుగా అనేక దేశాల దృష్టి జాబిల్లిపైకి మారింది. చందమామపై ఆధిపత్యం కోసం దేశాల మధ్య పోటీ మొదలైంది. చందమామపై ఉన్న అపార ఖనిజ నిక్షేపాలు, నీటి జాడలను సొంతం చేసుకోవడంతోపాటు భవిష్యత్తులో వాణిజ్య స్థాయిలో పర్యాటక అభివృద్ధి నుంచి ఆవాసాల ఏర్పాటు వరకు అక్కడి ఉపరితలంపై ముందుగా పాగా వేయాలని తహతహలాడుతున్నాయి.
చంద్రుడిపై అన్వేషణలో భాగంగా పలు దేశాలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్నాయి. ఈ క్రమంలో మరో ముందడుగు వేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. జాబిల్లిపై వచ్చే పదేళ్లలో విద్యుత్ కేంద్రం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందట..? ఈ దిశగా ఏయే దేశాలు ఎలాంటి ప్రయత్నాలు సాగిస్తున్నాయో తెలుసుకోవాలంటే లెస్ట్ వాచ్ దీస్ స్టోరీ
ఇటీవల అకస్మాత్తుగా ప్రపంచ దేశాల దృష్టి జాబిల్లిపైకి మళ్లింది. ఒకప్పుడు శాస్త్రీయ పరిశోధనలకే పరిమితమైన చంద్ర అన్వేషణ ఇప్పుడు వ్యూహాత్మక, ఆర్థిక, వాణిజ్య లక్ష్యాల దిశగా మళ్లుతున్నట్లు స్పష్టమవుతోంది. చందమామపై ఉన్న అపార ఖనిజ నిక్షేపాలు, నీటి జాడలు భవిష్యత్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారనున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
చంద్రుడిపై లభ్యమవుతున్న నీటిని ఇంధనంగా మార్చుకోవచ్చు. అలాగే అరుదైన ఖనిజాలు, హీలియం-3 వంటి వనరులు భవిష్యత్ శక్తి అవసరాలకు కీలకమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వాణిజ్య స్థాయిలో అంతరిక్ష పర్యాటకం, పరిశోధన కేంద్రాలు, శాశ్వత ఆవాసాల ఏర్పాటు లక్ష్యంగా దేశాలు ముందడుగు వేస్తున్నాయి. చంద్ర ఉపరితలంపై ముందుగా పాగా వేయడమే వచ్చే దశాబ్దాల్లో వ్యూహాత్మక ఆధిపత్యానికి కీలకంగా మారుతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ పోటీ మధ్య మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. చంద్ర అన్వేషణలో భాగంగా ఇప్పటికే పలు దేశాలు కీలక ప్రాజెక్టులను చేపట్టగా, ఇప్పుడు రష్యా మరింత ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. వచ్చే పదేళ్లలో చంద్రుడిపై విద్యుత్ కేంద్రం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ అంతరిక్ష వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది అమలైతే, చంద్రుడిపై దీర్ఘకాలిక మానవ ఉనికికి కీలక మౌలిక సదుపాయంగా మారే అవకాశముంది.
అయితే ఇక్కడే కొత్త ప్రశ్నలు మొదలవుతున్నాయి. అంతరిక్షం మొత్తం మానవాళికి చెందినదన్న అంతర్జాతీయ ఒప్పందాల మధ్య, చంద్రుడిపై వనరులపై ఆధిపత్యం సాధించే ప్రయత్నాలు చట్టబద్ధమా? వనరుల వినియోగం భవిష్యత్‌లో వివాదాలకు దారి తీస్తుందా? అంతరిక్షంలోనూ భూమిపై లాగానే శీతల యుద్ధ తరహా పోటీ మొదలవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రుడిపై అన్వేషణను మరింత విస్తరించేందుకు ప్రపంచ దేశాలు వరుసగా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ఈ పోటీలో తాజాగా రష్యా మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. జాబిల్లిపై రాబోయే పదేళ్లలోనే విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తోంది. తమ లూనార్ ప్రోగ్రామ్‌కు అవసరమైన విద్యుత్‌తో పాటు రష్యా–చైనా సంయుక్త పరిశోధనా కేంద్రానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది.
రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్కాస్మస్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. చంద్రుడిపై 2036 నాటికి విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రణాళికను రూపొందించినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు రష్యాకు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ లావొచ్‌కిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ విద్యుత్ కేంద్రం ద్వారా చంద్రుడిపై పనిచేసే రోవర్లు, అబ్జర్వేటరీలు, భవిష్యత్‌లో ఏర్పాటు చేయనున్న పరిశోధనా కేంద్రాలకు అవసరమైన శక్తిని అందించాలన్నది రష్యా లక్ష్యంగా పెట్టుకుంది.
రష్యా– చైనా కలిసి చంద్రుడిపై సంయుక్తంగా పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఆ కేంద్రానికి అవసరమైన మౌలిక వసతుల్లో విద్యుత్ సరఫరా కీలక పాత్ర పోషించనుంది. అందుకే ఈ విద్యుత్ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాస్కాస్మస్ తెలిపింది. చంద్రుడిపై దీర్ఘకాలిక పరిశోధనలకు, అక్కడ మానవ కార్యకలాపాలు సాగించేందుకు స్థిరమైన విద్యుత్ వనరు అవసరమని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.
అంతరిక్ష పరిశోధనల్లో ఒకప్పుడు అగ్రగామిగా నిలిచిన రష్యాకు గొప్ప చరిత్ర ఉంది. 1961లోనే తమ వ్యోమగామి యూరి గగారిన్‌ను అంతరిక్షంలోకి పంపి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ ఘనతతో అంతరిక్ష రంగంలో రష్యా పేరు చెరగని ముద్ర వేసింది. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే రష్యా కాస్త వెనకబడినట్లు కనిపిస్తోంది.
ఇటీవల చేపట్టిన కొన్ని ప్రతిష్ఠాత్మక ప్రయోగాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. 2023 ఆగస్టులో రష్యా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన లూనా-25 మిషన్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ముందే విఫలమైంది. ఈ ఘటన రష్యా అంతరిక్ష ప్రోగ్రామ్‌పై విమర్శలకు దారి తీసింది. అయినప్పటికీ, చంద్రుడిపై తమ ఉనికిని బలపరిచేందుకు రష్యా కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది.
చందమామపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పోటీలో అందరికన్నా చైనా ముందుంది. చాంగ్–3, 4, 5 మిషన్లతో చంద్రుని ఉపరితలంపై కబ్జా పెడుతోంది. ఈ దశాబ్దం చివరికల్లా చంద్రునిపై అడుగుమోపాలని చైనీయులు తహతహలాడుతున్నారు. 2030 నాటికి చైనా వ్యోమగాములు జాబిల్లిపై అడుగుపెట్టడం తథ్యమని చైనా ఢంకా భజాయించి చెబుతుంది.
వ్యోమగాములు చంద్రునిపై దిగడానికి ఉపయోగించే పరికరాల తయారీలో ఎంతో ముందంజ సాధించామని ఆయన చెప్పారు. వ్యోమగాములను తీసుకెళ్లే అత్యాధునిక రాకెట్‌ను, అంతరిక్షనౌకను చైనా సిద్ధం చేసుకుంటోంది. కొత్త తరం రాకెట్ తొలి ప్రయోగం 2027లో నిర్వహించాలని, 2030 నాటికి వ్యోమగాములను చంద్రునిపైకి పంపాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
చైనాకన్నా ముందే చంద్రునిపై ఆధిపత్యాన్ని నెలకొల్పాలని అమెరికా ఉవ్విళ్లూరుతోంది. చంద్రుడిపై ఇప్పటికే నాసా దృష్టి పెట్టింది. దీంతో యాభై ఏళ్ల తరువాత మళ్లీ చంద్రునిపై అడుగు పెట్టేందుకు నాసా కృతకృత్యమైంది. ఆర్టీమిస్ పేరిట ఓ సుదీర్ఘ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఇప్పటికే నాసాకి చెందిన ఓరియాన్ అంతరిక్ష నౌక చంద్రుని చుట్టూ తిరిగి భూమిమీదకు చేరింది.
వచ్చే పదేళ్లలో అన్ని దేశాలు, సంస్థలు కలిసి కనీసం 100 వరకు చంద్రయాన్‌లు నిర్వహించనున్నాయి. దీంతో భూమికి చంద్రునికి మధ్య విపరీతమైన రద్దీ ఏర్పడనుంది.! భూమి–చంద్రుడి మధ్యభాగాన్ని సిస్లూనార్ అని పిలుస్తారు. వ్యోమగాములను పంపడం, చంద్రుడిపై స్పేస్ స్టేషన్ నిర్మించడం, రోబోలతో కాలనీ నిర్మించడం వంటి అనేక కార్యక్రమాల కారణంగా సిస్లూనార్ మొత్తం రాకెట్లు, శాటిలైట్లు, అంతరిక్ష నౌకల ప్రయోగాలతో బిజీగా మారనుంది. సిస్లూనార్ స్పేస్‌లోని కొన్ని కక్ష్యలకు ఉన్న ప్రయోజనాల దృష్ట్యా వాటిని ఆక్రమించడానికి కూడా విపరీతమైన పోటీ ఏర్పడనుంది.
సాంకేతిక అభివృద్ధి కారణంగా అంతరిక్ష ప్రయోగాల ఖర్చు గణనీయంగా తగ్గిపోయింది. భౌగోళిక, రాజకీయ, వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా వివిధ దేశాలు, సంస్థల మధ్య పోటీ పెరిగిపోయి త్వరలో స్పేస్జామ్కు కారణం కాబోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా ప్రభుత్వం ఇటీవల సిస్లూనర్ స్పేస్‌ని అందరూ శాంతియుతంగా బాధ్యతాయుత, సుస్థిర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉపయోగించుకోవాలని కోరింది.
మరోవైపు, అమెరికా, చైనా మాత్రమే కాకుండా ప్రైవేటు రంగం కూడా అంతరిక్ష పరిశోధనల్లో దూసుకెళ్తోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ వరుస విజయాలతో ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రుడిపై విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న రష్యా ప్రణాళిక భవిష్యత్ అంతరిక్ష పోటీలో కీలక మలుపుగా మారే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అంతరిక్షాన్ని ఎవరి స్వప్రయోజనాలకు వాడుకోకుండా, మానవాళి మనుగడకు ఉపయోగించుకోవాలనే ఒప్పందంపై 1967లో 110 దేశాలు సంతకాలు చేశాయి. అలాగే అంతరిక్షాన్ని శాంతియుతంగా, పారదర్శకంగా ఉపయోగించుకోవడం కోసం అమెరికా, మరికొన్ని దేశాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు చంద్రుడి విషయంలో మాత్రం అనేక దేశాలు తమ భౌగోళిక, రాజకీయ, వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకొనేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి.
విజ్ఞాన అభివృద్ధి పేరిట మొదలైన చంద్ర అన్వేషణ ఇప్పుడు జియోపాలిటిక్స్ రంగును పులుముకుంటుంది. రాబోయే దశాబ్దాల్లో జాబిల్లి కేవలం భూమి సహజ ఉపగ్రహంగా కాకుండా, ప్రపంచ శక్తి సమీకరణాల్లో కీలక కేంద్రంగా మారుతుందా అన్నది కాలమే నిర్ణయించనుంది.



