ఇరాన్‌తో యుద్ధంలో ఇజ్రాయిల్ సీక్రెట్ ఆపరేషన్

Israel-Iran: యుద్ధమే ఆ దేశం ఊపిరి. పోరులోనే పుట్టి పోరాటంతోనే ఎదిగింది. యుద్ధమే ఊపిరై అస్తిత్వతమే అజెండాగా చుట్టూ శత్రువులు ఉన్నా.. తగ్గకుండా నెగ్గుకుంటూ ముందుకు వెళ్తోంది ఇజ్రాయెల్. చిక్కదు, దొరకదు, ఊహకు అందదు అన్నట్లుగా రఫ్ ఆడించేస్తోంది. నీ పక్కనే ఉంటా, నువ్వు ఉన్న దగ్గరకు వస్తా, నీడలా వెంటాడతా, నీళ్లు తాగాలన్నా కూడా ఆలోచించే పరిస్థితి తీసుకొస్తా అన్నట్లుగా అపరేషన్స్ చేస్తోంది. ఎలా అయితే అలా అయ్యింది.. అంతమే పంతం అంటోంది ఇజ్రాయెల్. ఇంతకీ ఊహకు అందకుండా ఇజ్రాయిల్ ఎలా ఆపరేషన్స్ చేస్తోంది..? కట్టప్పలతో ఇజ్రాయిల్ శత్రువు దేశాల అంతు చూస్తోందా..? అసలు ఇజ్రాయిల్ చేస్తోన్న సీక్రెట్ ప్లాన్ ఏంటి..?
గెలవాలనే తపన శత్రువు అంతు చూడాలనే కసి యుద్ధ భూమి నుంచి విజయంతోనే వెనుదిరగాలనే పట్టుదల. ఇదే వ్యూహ రచనతో వచ్చినోళ్లకు వచ్చినట్లు ఇచ్చిపడేస్తోంది ఇజ్రాయెల్. ఏం చేస్తుందో తెలియదు, ఎలా మట్టుబెడుతుందో అంతు చిక్కదు. కొడితే దిమ్మతిరిగి పోవాల్సిందే. ఇజ్రాయెల్ ఆపరేషన్ అంటే అట్లుంటది. దెబ్బ మీద దెబ్బ కొట్టి పాలస్తీనా మీద పట్టు సాధించింది. హమాస్ ను ఆగం చేసింది. హెజ్ బొల్లాకు ఇచ్చి పడేసింది.
లెబనాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇరాన్ కు వణుకు పుట్టిస్తోంది ఇజ్రాయెల్. బరి గీసి కొట్లాడేందుకైనా వైమానిక దాడులైనా కోవర్టు ఆపరేషన్లలో అయినా అప్పర్ హ్యాండ్ సాధిస్తూ వస్తోంది ఇజ్రాయెల్. కోవర్ట్ ఆపరేషన్ అయినా, డైరెక్ట్ అటాక్ అయినా, సొరంగంలో దాక్కున్నా ఒక్కొక్క శత్రువును పొగ పెట్టి మరీ బయటకు తీసి ఖతం చేసేస్తోంది. హమాస్ నుంచి హెజ్ బొల్లా లీడర్ల వరకు గాజా నుంచి ఇరాన్ వరకు ఎనిమీ ఎవరన్నది లెక్క చేయడం లేదు.
జనాభా పరంగా చిన్న దేశమే అయినా ఆయుధ సంపత్తి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆర్మ్స్ పరంగా చాలా స్ట్రాంగ్. అందుకే తమ దేశానికి చిన్న హాని కలిగినా ఎక్కడా తగ్గదు. గాజా మీద దాడులు మొదలు ఇప్పుడు ఇరాన్ వరకు శత్రు దేశాలు, మిలిటెంట్ల అంతు చూస్తూ వస్తోంది. పాలస్తీనా, గాజా, హమాస్, ఇరాన్, లెబనాన్, హిజ్ బొల్లా ఇలా అందరినీ మడత పెట్టేస్తోంది.
తమ వరకు వస్తే ఏ విషయంలోనూ తగ్గదేలే అంటోంది ఇజ్రాయెల్. శత్రువుల మీద పైచేయి సాధించామా లేదా అన్నట్లుగానే యుద్ధం చేస్తోంది. సీక్రెట్ ఆపరేషన్లతో హడలెత్తిస్తోంది. ఎక్కడ నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరి మీద అటాక్ చేయబోతోందో అనేది అంతు చిక్కకుండా శత్రువును భస్మం చేసేస్తుంది.
ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించింది. దీంతో ఏకంగా టెహ్రాన్ అగ్ర నాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టేలా ప్లాన్ చేసింది. అయితే ఈ ఆపరేషన్ త్రుటిలో లక్ష్యాన్ని తప్పింది. ఇరాన్ అగ్రసైనిక, రాజకీయ నాయకత్వం ప్రాణాలతో బయటపడినా అధ్యక్షుడు పెజెష్కియాన్ కాలికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా ఆ ఆపరేషన్ వివరాలను ఓ అమెరికా పత్రిక బహిర్గతం చేసింది.
జూన్ 13న ఇరాన్ ఐఆర్‌జీసీ చీఫ్ సలామీ, ఆర్మీ చీఫ్ బాఘేరీ, మిసైల్స్ చీఫ్ అమీర్ అలీ హజిజాదేలను ఇజ్రాయెల్ తొలి దాడుల్లోనే మట్టుపెట్టింది. వాస్తవానికి స్మార్ట్ ఫోన్లను ఇజ్రాయెల్ ట్రాక్ చేస్తుండటంతో వాటితో ముప్పు ఉంటుందని ఇరాన్ నాయకత్వానికి తెలుసు. ఈ క్రమంలో రాజకీయ, సైనిక నాయకత్వం వాటిని వాడటం మానేసింది.
కానీ, వారి బాడీగార్డులు ఫోన్లను వాడేవారు. సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారు. దీంతో వారిని ఇజ్రాయెల్ ట్రాక్ చేసింది. యుద్ధం ముందు వరకు వారి కదలికలను గుర్తించింది. జూన్ 13 దాడుల తర్వాత బాడీ గార్డులను కూడా ఫోన్లు వాడొద్దని కేవలం వాకీ టాకీలనే వినియోగించాలని ఇరాన్ ఆదేశించింది.
కానీ, జూన్ 16న జరిగిన కీలక సమావేశ సమయంలో ఓ బాడీగార్డ్ ఆ ఆదేశాలను ఉల్లంఘించారు. యుద్ధం వేళ ఇజ్రాయెల్‌కు అదో పెద్ద అవకాశంలా లభించింది. ఆ సంకేతాల ఆధారంగా 100 అడుగుల లోతులోని బంకర్‌పై దాడి చేసింది. వాస్తవానికి ఆ రహస్య ప్రదేశంలో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతోంది.
దానిలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, న్యాయవిభాగం, ఇంటెలిజెన్స్ అధిపతులు కూడా ఉన్నారు. వీరంతా వేర్వేరు కార్లలో అక్కడికి చేరుకొన్నారు. ఎవరూ ఫోన్లు తీసుకురాలేదు. కానీ, ఓ బాడీగార్డ్ నిర్లక్ష్యాన్ని ఇజ్రాయెల్ వాడుకొని దాడి చేసింది. ఈ దాడిలో పెజెష్కియాన్ కాలికి తీవ్రగాయమైంది. మిగిలిన వారు ప్రాణాలతో బయటపడినా గార్డులు మాత్రం మరణించారు.
ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ డజన్లకొద్దీ సైనిక కమాండర్లను మట్టుపెట్టగా మరో డజను మంది వరకు అణుశాస్త్రవేత్తలను హతమార్చింది. 1980 ఇరాక్-ఇరాన్ యుద్ధం తర్వాత ఈ స్థాయి ఎదురుదెబ్బ టెహ్రాన్‌కు ఎప్పుడూ తగల్లేదు. 2022 నుంచి ఇరాన్ అణుశాస్త్రవేత్తలను ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. గతేడాది అక్టోబర్ నాటికే వారిని చంపాలని చూసినా బైడెన్ కార్యవర్గంతో అభిప్రాయభేదాల వల్ల ఆగింది. గతేడాది చివరి నుంచి జూన్ వరకు ఇజ్రాయెల్‌లోని ఓ బృందం ఇరాన్ అణుకార్యక్రమంలోని శాస్త్రవేత్తల ప్రొఫైల్స్‌ను రివ్యూ చేసింది.
2018లో ఇరాన్ నుంచి అపహరించిన అణుకార్యక్రమ వివరాల్లో వారి పేర్లు ఉన్నాయి. మొత్తం 400 మందిని చంపేందుకు షార్ట్‌లిస్ట్ చేయగా చివరికి దానిని 100 మందికి కుదించింది. చివరికి 13 మందిని చంపింది. అదే సమయంలో ఆపరేషన్ రెడ్ వెడ్డింగ్ పేరిట ఇరాన్ సైనిక నాయకత్వాన్ని కూడా లక్ష్యంగా చేసుకొంది.
ఈ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేస్తున్నవారిని ఇరాన్ అరెస్టు చేసింది. వారిలో అణుశాస్త్రవేత్త రుజ్‌బెహ్ వాది కూడా ఉండటం విశేషం. అతడిని ఆగస్టులో ఉరితీసింది. యుద్ధ సమయంలో మొస్సాద్ కోసం గూఢచర్యం చేసిన మరో 8 మందిని అరెస్టు చేసినట్లు తాజాగా టెహ్రాన్ ప్రకటించింది. కానీ, అప్పటికే ఇరాన్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.



