తెలంగాణ

తెలంగాణలో అకాల వర్షం బీభత్సం.. కళ్లముందే నీటిపాలైన రైతన్న కష్టం

తెలంగాణ రైతాంగాన్ని అకాల వర్షం అగాధంలోకి నెట్టింది. రాత్రికి రాత్రే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో విరుచుకుపడిన వానదేవుడు.. అన్నదాతల కడుపు కొట్టాడు. రాష్ట్రంలోని సిద్దిపేట, మెదక్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డులు, కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం, మొక్కజొన్న పంటలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి.

ముఖ్యంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో అకాల వర్షం శాపంగా మారింది. గజ్వేల్ మార్కెట్ యార్డులోనే కాకుండా, రహదారులపై ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. మర్కుక్ మండలం పాములపర్తిలో యాదయ్య అనే రైతు ఇంటి ముందు ఆరబోసిన వడ్లు.. వరద నీటిలో కొట్టుకుపోవడం చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. అటు గజ్వేల్-భువనగిరి రహదారిపై చెట్లు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలోని రామాయంపేట, చేగుంట, నార్సింగి, చిన్న శంకరంపేట మండలాల్లో సైతం కొనుగోలు కేంద్రాల్లోకి వర్షపు నీరు చేరి ధాన్యపు రాశులు నానబెట్టినట్లయ్యాయి.

మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బాలనగర్ కేంద్రంలో, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. గత 30 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నా.. అధికారులు ధాన్యం సేకరించకపోవడం వల్లే ఈరోజు తమ పంట నీటిపాలైందని రైతులు మండిపడుతున్నారు. వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని అన్నదాతలు రోడ్డుపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button