తెలంగాణలో ‘మార్వాడీ గో బ్యాక్’

Telangana: ప్రస్తుతం తెలంగాణలో ఒక ఉద్యమం నడుస్తుంది. ఆ ఉద్యమం ఏమిటంటే మార్వాడి ఉద్యమం. వాస్తవానికి ఆంధ్ర వారి కంటే కూడా తెలంగాణలో మార్వాడి వారికే ఎక్కువగా వ్యాపారాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో అయితే అమీర్పేట, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజ్గిరి, కోటి, అబిడ్స్, ఖైరతాబాద్, నాంపల్లి ప్రాంతాలలో మార్వాడీలు అధికంగా విస్తరించారు. మొదట్లో మార్వాడీలు చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించేవారు. వీరిలో ప్రధానంగా మిఠాయి దుకాణాలు కొనసాగించేవారు.
ఆ తర్వాత క్రమక్రమంగా వివిధ రంగాల్లోకి విస్తరించారు. ఇక్కడ కుటుంబాలకు కుటుంబాలుగా ఏర్పడి ఆధార్, ఓటర్ ఐడి కార్డులు సాధించారు. నిజానికి మార్వాడి వ్యాపారులు మొదట్లో స్థానికులకు ఉపాధి కల్పించేవారు. అయితే ఇటీవల కాలంలో వారి సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే విధుల్లోకి తీసుకుంటున్నారు. స్థానికుల వ్యాపారాలను తీవ్రంగా దెబ్బ కొడుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్నవారు ఉపాధి లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఇటీవల కాలంలో మార్వాడి వ్యాపారులకు స్థానిక వ్యాపారులకు వాగ్వాదాలు జరిగాయి. ఇవన్నీ అక్కడ అక్కడ జరిగిన చిన్నపాటి సంఘటనలు గానే కనిపిస్తున్నప్పటికీ ఆ చుక్కలన్నిటీని కలిపితే కనిపించని ఉధ్యమమే కనిపిస్తోంది లోలోపల. పార్కింగ్ విషయంలో జరిగిన సోషల్ మీడియాలోకి రావడంతో ఈ వివాదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఏకంగా గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం మొదలైంది.
తెలంగాణలో ఉన్న మార్వాడి వ్యాపారులు మొత్తం వారి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని స్థానిక వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. తమకు ఉపాధి లేకుండా వ్యాపారాలు కొనసాగించకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఈ ఉద్యమానికి కారణమవ్వగా దీని వెనుక రాజకీయ కోణం ఉందన్న ఆరోపణలు కూడా వినివస్తున్నాయి.
ఈ ఉద్యమం పురుడు పోసుకోవడానికి ప్రధాన కారణం ఒక మార్వాడీ తన కారును తీయమని అడిగిన తెలంగాణ యువకుడిని చితకబాదడంతోనే తలెత్తిందన్న ప్రచారం సాగుతోంది. ఇది కేవలం పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ మాత్రమే కదు మరో వైపు గోరెటీ రమేశ్ అనే గాయకుడు మర్వాడీలకు వ్యతిరేకంగా పాట పాడటంతో ఆయనపై మర్వాడీలు కేసు పెట్టడం, వారు ఆయనను అరెస్ట్ చేయడం ఈ గొడవకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఎక్కడి నుంచో తెలంగాణకు బతకడానికి వచ్చిన మర్వాడీలు తెలంగాణ వారిపై దాడులకు దిగుతున్నారంటూ మొదట సోషల్ మీడియాలో మొదలయిన ఉద్యమం ఆ తర్వాత వీధుల్లోకి చేరింది.
మార్వాడీలు ఇక్కడ వ్యాపారాలు చేస్తూ స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో స్థానికులు ఉపాధి కోల్పొతున్నారన్న ఆరోపణలు వివవస్తున్నాయి. ఈ విషయమై ఈ నెల 18వ తేదీన వ్యాపారస్తులు ఆమనగల్లు బంద్ కు తొలుత పిలుపునిచ్చినప్పటికీ దానిని వాయిదా వేసుకున్నారు. మార్వాడీ సంఘాల నేతలతో చర్చించేందుకే బంద్ ను వాయిదా వేయనున్నట్లు ప్రకటించారు.
అయితే మార్వాడీలు వ్యాపారాలు చేసుకుంటూ బతకవచ్చని, అదే సమయంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, వారు కనీసం జీఎస్టీ, రాష్ట్ర పన్నులు కూడ చెల్లించడం లేదని, ఆన్ లైన్ నగదు లావాదేవీలను వారు అనుమతించడం లేదని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన గాయకుడు, రచయిత గోరేటి రమేష్ మార్వాడీల దోపిడీని వివరిస్తూ ఒక పాట రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పాట పెద్ద ఎత్తున వైరల్ కావడంతో మార్వాడీలకు వ్యతిరేకంగా గో బ్యాక్ మార్వాడీ అనే నినాదం మొదలైంది.
గోరేటి రమేష్ రాసిన పాటతో స్ఫూర్తి పొందిన స్థానిక గ్రూపులు, ప్రజలు సోషల్ మీడియాలో మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం ఉధృతం అయింది. మార్వాడీల దుకాణాలను, స్వీట్ హౌస్‌లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వారి దగ్గర వస్తువులు కొనవద్దని, ఆహార పదార్థాలు తీసుకోవద్దని ప్రచారం చేస్తున్నారు.
ఇదే సమయంలో మర్వాడీ గోబ్యాక్ ఉద్యమం మరో రూపం తీసుకుంది. మార్వాడీ హఠావో తెలంగాణ బచావో పేరుతో ఈనెల 22న ఓయూ జేఏసీ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. అదే సమయంలో మార్వాడీ వ్యాపారి హఠావో-తెలంగాణ వ్యాపారీ బచావో’ పేరుతో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీనగర్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ 3 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో వివిధ వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు.
గుజరాత్, రాజస్థాన్ నుంచి వలస వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ కుల వృత్తులను దెబ్బ తీస్తున్నారని వారు మండిపడుతున్నారు. అయితే మర్వాడీలు మాత్రం తాము ఎవరికీ అన్యాయం చేయడం లేదంటున్నారు. తెలంగాణ వ్యాపారులను దెబ్బతీస్తూ గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించి అరాచకం సృష్టిస్తున్నారని అన్నారు. ఇలాంటి ఆరాచకాలను ఇక సహించేది లేదని తెలంగాణ నుంచి ఉరికించి కొడుతామని హెచ్చరించారు. గతంలో ఆంధ్రా పెత్తందారులను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణ వాదులకు ఉందని అది మార్వాడీలు గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
మరోకవైపు ఈ ఉద్యమం రాజకీయ రంగు పులుపుకుంటోంది. మర్వాడీలు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నందునే కాంగ్రెస్, బీఆర్ఎస్ మర్వాడీలను వ్యతిరేకిస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మార్వాడీలు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. పెట్టుబడులు తెచ్చే వారిని తరిమేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మార్వాడీలు వ్యాపారాలు చేసుకుంటున్నారని, వారికి రాజకీయం అంటగడితే ఎలా అని కమలనాధులు ప్రశ్నిస్తున్నారు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించే హక్కు అందరికీ ఉంటుందని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు.
కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్ట్ వంటి రాజకీయ పార్టీలు హిందువులను చీల్చే కుట్ర చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మార్వాడీలు వ్యాపారాలు చేసుకుంటే తప్పేమిటి, వాళ్లు ఎవరినీ దోచుకోవడం లేదని ఆయన అన్నారు. మార్వాడీలు ఏ నాడు రాజకీయ పదవుల కోసం ప్రాకులాడలేదని, వ్యాపారాలు చేసుకుంటూ తెలంగాణలో సంపద సృష్టిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. డ్రై క్లీనింగ్ , మటన్ షాపులు నిర్వహిస్తున్న ఒక వర్గం కుల వృత్తులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఆయన అన్నారు. ‘బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన రోహ్యింగాలకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని బండి సంజయ్ అన్నారు.
ఈ సమస్య ఇక్కడితోనే ఆగి పోయేది కాదని ఇంకా చాలా దూరం వెళుతుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను ముగిసిపోయింది అనుకోవద్దని దీని మూలాలను కనుగొని పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. సమస్య ప్రస్తుతం తాత్కాలికంగా పరిష్కారం మాత్రమే అయిందని ఇంకా అనేక రకాల రూపాలలో ఈ సమస్య తెలంగాణ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



