తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల వేంకటేశ్వరుడి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో ఎటు చూసినా భక్తులు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నారు. కొండపైకి భక్తులు పోటెత్తడంతో.. ఏడుకొండలవాడి దర్శనం కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేసవి సెలవులకు తోడు వీకెండ్ కూడా కావడంతో భక్తుల రద్దీ అంచనాలకు మించి పెరిగిపోయింది. అటు నడకదారులు భక్తులతో నిండిపోగా.. ఇటు తిరుమల ఘాట్ రోడ్లు వాహనాల రాకపోకలతో పూర్తిగా బిజీగా మారాయి.
సర్వదర్శనం, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం.. ఇలా ఏ దర్శనానికైనా సరే గంటల కొద్దీ నిరీక్షణ తప్పడం లేదు. ఒక్క దర్శనానికే కాదు.. శ్రీవారికి తలనీలాలు సమర్పించేందుకు, అటు వసతి గదులు పొందేందుకు కూడా భక్తులు గంటల తరబడి లైన్లలో వేచి ఉంటున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి దాదాపు 24 గంటల సమయం పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



