అంతర్జాతీయం

ప్రపంచంలోనే తొలి ఏఐ మంత్రి

ప్రపంచాన్ని ఏఐ కొత్త పుంతలు తొక్కిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏఐ చేస్తున్న అద్భుతాలు అన్నీఇన్నీ కావు. చివరకు మనిషి అవసరం లేకుండా అన్నీ ఏఐ చేసేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ దేశంలో ఏకంగా ఏఐ మహిళా మంత్రినే నియమించారు. ఇలా ఏఐ మంత్రిని నియమించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఇంతకీ ఏ దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు..? ఎందుకు తీసుకున్నారు..? ఏఐ మేడ్ మినిస్టర్ అసలు ఎలా పని చేస్తుంది? దీని ద్వారా ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందా? ఇంతకీ ఈ ఏఐ మంత్రి కథేంటీ..?

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మాటే వినిపిస్తోంది. ఏఐ అద్భుతాలు చేస్తోందనే చెప్పాలి. సరికొత్త పుంతలు తొక్కుతోంది. అందుకే అన్ని రంగాల్లో ఏఐ వాడకం గణనీయంగా పెరిగింది. యూరప్ కు చెందిన ఓ దేశం చేసిన పని ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఇంట్రస్టింగ్ గా మారింది. అల్బేనియా ఏకంగా తమ ప్రభుత్వంలో ఏఐ మినిస్టర్‌‌‌‌ను నియమించింది. ఇలా ఒక వర్చువల్ మినిస్టర్‌‌‌‌ను నియమించడం ప్రపంచంలోనే మొదటిసారి.

ఎవరూ ఊహించని రీతిలో ఏఐని వినూత్నంగా ఉపయోగిస్తోంది అల్బేనియా. అవినీతి నిరోధానికి ఖతర్నాక్ ప్లాన్ వేసింది. ఏఐ ఆధారిత అసిస్టెంట్‌ డియెల్లాను క్యాబినెట్‌ మంత్రిగా నియమించింది. ఈ తరహా నియామకం ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్. ఈ ఏఐ మహిళా మంత్రిని కేబినెట్ మీటింగ్‌‌లో అల్బేనియా ప్రధాని ఏడీ రామా పరిచయం చేశారు.

ఈమెకు డియెల్లా అని పేరు పెట్టారు. అంటే అల్బేనియన్ భాషలో సూర్యుడు అని అర్థం. డియెల్లా అల్బేనియన్ సంప్రదాయ దుస్తులు ధరించి అందంగా కనిపిస్తున్నది. ఆధునిక సాంకేతికత, సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో ఆ ఏఐ చాట్‌బాట్‌ను తీర్చిదిద్దారు. పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ విభాగాన్ని పర్యవేక్షించేందుకు ఈమెను నియమించారు.

ఈ విభాగంలో భారీఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందని అల్బేనియా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా, పాలనా వ్యవస్థపై విశ్వాసం పెరిగేలా దశలవారీగా ఈతరహా సంస్కరణలు తీసుకువస్తామని ప్రధాని వెల్లడించారు. ఈ ఏఐ వ్యవస్థ ద్వారా అవినీతిపై జరిపే పోరాటంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తామన్నారు.

ఈ డియెల్లా.. పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌ విధానాల్లో సమూల మార్పులు తీసుకురానుంది. ఎలాంటి అవినీతికి తావులేకుండా ప్రభుత్వ టెండర్లను పర్యవేక్షించనుంది. పక్షపాతం, ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా టెండర్లను మూల్యాంకనం చేయనుంది. పారదర్శకతతో పబ్లిక్ ఫండ్ కేటాయింపులు జరిగేలా చూడనుంది.

డియెల్లాను ఈ ఏడాది జనవరిలోనే లాంచ్ చేశారు. ఏఐ వర్చువల్ అసిస్టెంట్‌‌గా సేవలందించింది. 36,600 డాక్యుమెంట్లను ఇష్యూ చేయడంలో సాయమందించింది. దాదాపు వెయ్యి సర్వీసులను అందించింది. అల్బేనియా ఆన్‌లైన్ పోర్టల్ అయిన ఇ-అల్బేనియాను ఈ మంత్రి పర్యవేక్షిస్తుంది. దేశంలోని సుమారు 95 శాతం ప్రభుత్వ సేవలను ఈ ఏఐ మంత్రి పర్యవేక్షిస్తారు.

ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రజలకు వాయిస్ కమాండ్‌లు ఇవ్వడం దగ్గర నుంచి, దరఖాస్తులు తీసుకోవడం, సలహాలు ఇవ్వడం వంటి పనులన్నీ చేసేస్తుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటూ పాలనా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని తెలిపారు.

కాగా… యూరోపియన్ యూనియన్‌లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న అల్బేనియాకు అవినీతి ఒక ప్రధాన అవరోధంగా మారింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన అవినీతి సూచీలో 180 దేశాల జాబితాలో అల్బేనియా 80వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం సాంకేతికతను ఆయుధంగా ఎంచుకుంది.

మే లో జరిగిన ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి గెలిచారు రమా. త్వరలో తన కొత్త మంత్రివర్గాన్ని పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉంది. పబ్లిక్ టెండర్లకు సంబంధించిన అన్ని నిర్ణయాలను డీయెల్లా నిర్వహిస్తారు. అవి 100 శాతం అవినీతి రహితంగా ఉంటాయి. టెండర్ విధానానికి సమర్పించబడిన ప్రతి పబ్లిక్ ఫండ్ పారదర్శకంగా ఉండేలా నిర్ధారిస్తుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

అయితే ఈ ఏఐ మంత్రి నియామకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్బేనియా రాజకీయాల్లో ఏఐని ఏమార్చుతారని, డియెల్లా కూడా అవినీతి బారిన పడుతుందని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం ప్రభుత్వం దూరదృష్టిని కొనియాడారు. ఈ ఏఐ మంత్రి నిర్ణయాలు ఆచరణలో ఎలా ఉంటాయో, వాటిని కోర్టులో సవాలు చేయొచ్చా..? అనే దానిపై మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టతా లేదు.

అల్బేనియన్ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో ఇది కీలక మలుపు అని ఆ దేశ మీడియా అంటుండగా ఈ ఏఐ పాలన వల్ల చివరకు ఎదురుదెబ్బ తగలవచ్చేమో అంటూ మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అల్బేనియా ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button