Jaish Women Wing: మహిళలకు జైషే ఆన్‌లైన్ జీహాద్ కోర్సు.. రూ. 500 కొట్టి 5 వేల మంది చేరిక

Jaish Women Wing: జైషే మహ్మద్ పాకిస్తాన్‌కు చెందిన కరుడుగట్టిన ఉగ్రసంస్థ. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న దానికి బుద్ది రాలేదు. ఇప్పుడు మరింత బరితెగించి.. భారీ కుట్రలకు తెరలేపుతుంది. భారత భద్రతా సంస్థలకు సవాల్ విసురుతూ.. కొత్త వ్యూహాన్ని ఆవిష్కరించింది. ఈ వింగ్‌కు అజార్ సోదరి సాదియా నాయకత్వం వహిస్తున్నారు. ఆన్‌లైన్ కోర్సులను కూడా ప్రారంభిస్తూ నిధులను సేకరిస్తున్నారు. ఇంతకీ జైష్-ఎ-మహ్మద్ సంస్థ వేసిన కొత్త ప్లాన్ ఏంటి..? ఎలా నిధులను సేకరిస్తుంది..? దీనిపై మోదీ యాక్షన్ ఎలా ఉండబోతుంది..?
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్, భారత భద్రతా సంస్థలకు సవాలు విసురుతూ కొత్త వ్యూహాన్ని ఆవిష్కరించింది. మసూద్ అజార్ నేతృత్వంలోని కొత్త మహిళా వింగ్ జమాత్ ఉల్ మోమినాత్ ద్వారా కేవలం కొద్ది వారాల్లోనే 5,000 మందికి పైగా మహిళలను ఆకర్షించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ సంస్థ 500 ఫీజుతో 40 నిమిషాల ఆన్‌లైన్ శిక్షణ ఇస్తూ మహిళలను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తోంది.
ఐఎస్‌ఐఎస్ తరహాలో ఫిదాయిన్ అంటే ఆత్మాహుతి దాడులకు ఈ మహిళలతో బ్రిగేడ్‌లను ఏర్పాటు చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. ఈ వింగ్‌కు అజార్ సోదరి సాదియా నాయకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని నేరుగా మసూద్ అజార్‌యే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వీరిని ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి, తీవ్రవాద చర్యలకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి.
కేవలం కొన్ని వారాల్లోనే 5,000 మందికి పైగా మహిళలు జమాత్ ఉల్ మోమినాత్‌లో చేరడం దేవుడి దయ. నియామకం అయిన వెంటనే వారి మనస్తత్వం మారి, జీవిత లక్ష్యాన్ని తెలుసుకున్నామని అనేక మంది సోదరీమణులు చెప్పారని అజార్ తెలిపారు. ఈ నియామకాలు అక్టోబర్ 8వ జైష్ ప్రధాన కార్యాలయం మార్కజ్ ఉస్మాన్-ఓ-అలీ వద్ద ప్రారంభం అయ్యాయి. పాకిస్థాన్‌లోని బహవల్పూర్, ముల్తాన్, సియాల్‌కోట్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లి వంటి ప్రాంతాల నుంచి మహిళలను ఇందులో చేర్చుకున్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం మహిళలను ఆన్‌లైన్ ద్వారా రిక్రూట్ చేసి, శిక్షణ ఇస్తున్నారు.
ఈ ఆన్‌లైన్ తరగతులు 40 నిమిషాలు ఉంటాయని ప్రతి సభ్యురాలు 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఐఎస్‌ఐఎస్, హమాస్, ఎల్‌టీటీఈ తరహాలో ఆత్మాహుతి దాడులు నిర్వహించడానికి ఈ మహిళలతో ఉగ్రవాద బ్రిగేడ్‌లను ఏర్పాటు చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం అని తెలుస్తోంది. అయితే జమాత్ ఉల్ మోమినాత్ విభాగానికి మసూద్ అజార్ సోదరి సాదియా నాయకత్వం వహిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో సాదియా భర్త యూసుఫ్ అజార్ మృతి చెందాడు.
ఈ వింగ్‌లో కీలకమైన మరో మహిళా కూడా ఉంది. ఆమె మరెవరో కాదు పుల్వామా దాడి సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్య అఫిరా. ఎన్‌కౌంటర్‌లో ఫరూక్ మరణించిన తర్వాత ఆమె ఈ విభాగంలో చేరింది. ఈ మహిళా వింగ్‌లో చేరిన సభ్యులకు పురుషుల తరహాలోనే దౌరా-ఎ-తస్కియా అనే ఇండక్షన్ కోర్సులో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ మార్కజ్ ఉస్మాన్-ఓ-అలీ వద్ద జరుగుతుంది. ఇక ఈ బ్రిగేడ్‌లో చేరేవారికి రూల్స్ కూడా కఠినంగా ఉన్నాయట.
భర్త లేదా కుటుంబసభ్యుడు మినహా తెలియని ఏ పురుషుడితోనూ మాట్లాడొద్దని వీరికి ఆంక్షలు పెట్టినట్లు సమాచారం. ఈ మహిళా విభాగానికి మసూద్ సోదరి సాదియా అజార్ నాయకురాలు. ఇక, ఆన్‌లైన్ క్లాసులకు అఫీరా బీబీ నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఈమె పుల్వామా ఉగ్రదాడుల సూత్రధారి ఉమర్ ఫరూఖ్ భార్య. జైషేలో టాప్ కమాండర్ అయిన ఉమర్ 2019 మార్చిలో కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కేంద్రంపై భారత్ బాంబులు జారవిడిచారు. ఆ దాడుల్లో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. మృతుల్లో మసూద్ బావ, సాదియా భర్త యూసఫ్ అజార్ కూడా ఉన్నాడు. ఈ ఊహించని దెబ్బ నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తోన్న అజార్ ముఠా కొత్త పన్నాగాలకు తెరతీసింది. ఈ క్రమంలోనే మహిళా బ్రిగేడ్‌ను ఏర్పాటు చేసింది.
మహిళలను ఉగ్రవాదంవైపు మళ్లించడం అనేది జైషే మహ్మద్ అనుసరిస్తున్న కొత్త తరహా వ్యూహంగా కనిపిస్తోంది. మహిళలు రక్షణ దళాల దృష్టిని అంతగా ఆకర్షించలేరనే అంచనాతో వారిని సరిహద్దుల్లో లేదా అంతర్గత భద్రతా ప్రాంతాల్లో ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ పరిణామం భారతదేశ భద్రతా దళాలకు సరికొత్త సవాలుగా పరిణమించింది.
దీనిని ఎదుర్కోవాలంటే, ఉగ్రవాద నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై, సరిహద్దు ప్రాంతాలలోనూ, అంతర్గత ప్రాంతాలలోనూ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై నిఘాను మరింత పెంచడం, మహిళా రిక్రూట్‌మెంట్, వారి శిక్షణ వివరాలను సేకరించడం అత్యవసరం. ఈ రిక్రూట్‌మెంట్ వెనుక ఉన్న ఉగ్రవాద లక్ష్యాలను, ప్రణాళికలను ముందుగానే పసిగట్టడం ద్వారా భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చు.
కాగా మసూద్ అజార్ తొలిసారిగా 1994 జనవరి 29న బంగ్లాదేశ్ ఢాకా నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. ఓ ఫేక్ ఐడెంటిటీ కార్డ్ ఉపయోగించి 1994లో అజార్ శ్రీనగర్‌లోకి ప్రవేశించాడు. ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నందుకు అతన్ని అనంతనాగ్‌లో అరెస్టు చేశారు. కాశ్మీర్‌ను విముక్తి చేయడానికి 12 దేశాల నుంచి ఇస్లాం సైనికులు వచ్చారని పోలీసుల కస్టడీలో ఉన్న అజార్ అన్నాడు.
నాలుగు సంవత్సరాల తరువాత జూలై 1995లో జమ్మూ కాశ్మీర్‌కు వచ్చిన ఆరుగురు విదేశీ పర్యాటకులు కిడ్నాప్ చేయబడ్డారు. కిడ్నాపర్లు ఆ పర్యాటకుడిని విడిపించేందుకు బదులుగా మసూద్ అజార్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టులో ఇద్దరు పర్యాటకులు కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్నారు. తర్వాత మిగిలిన వారి గురించి ఎలాంటి సమాచారం రాలేదు.
1999 డిసెంబర్ 24న ఖాట్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న భారతీయ విమానాన్ని అజార్ సోదరుడు, ఇతర ఉగ్రవాదులు హైజాక్ చేశారు. 2009లో అజార్‌ను ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలనే ప్రతిపాదన మొదటిసారి వచ్చింది. 2016 అక్టోబర్‌లో చైనా మళ్ళీ భారతదేశం ప్రతిపాదనను వ్యతిరేకించి, UNSCలో అజార్‌ను కాపాడింది. 2017లో అమెరికా UNSCలో అజార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలనే డిమాండ్‌ను లేవనెత్తింది. కానీ చైనా మళ్ళీ జోక్యం చేసుకుంది. చివరికి 2019 మేలో మసూద్‌ను UNSCలో ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించారు.
గత నెలలో ఢిల్లీలో కారు బాంబు చేశారు పాకిస్తానీయులు. ఈ పేలుడులో 13 మంది మరణించిన తర్వాత.. ఈ జమాత్ ఉల్ మోమినాత్ పేరు వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడిన కేసులో అరెస్టు అయిన డా. షహీన్ సయీద్ అనే వ్యక్తికి ఈ జైష్ మహిళా వింగ్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ పరిణామాలు భారత భద్రతా దళాలకు పెను సవాల్‌గా మారాయి.



