బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం

కరీంనగర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం రాజకీయ విమర్శలకు వేదికగా మారింది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జిల్లా కేంద్రంలోని కొండా సత్యలక్ష్మి వేదికలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, రైతుల సమస్యలు, అలాగే ఎన్నికల సన్నాహకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మేడిగడ్డ నుంచి నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రాజకీయ కారణాలతో నిర్లక్ష్యం చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తోందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ పాత్రను గుర్తు చేసిన ఆయన, రైతులకు మేలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. తనపై నమోదైన కేసులకు భయపడేది లేదని స్పష్టం చేసిన ఆయన, కార్యకర్తలపై నమోదు చేస్తున్న కేసులను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాబోయే ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని హరీశ్‌రావు పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సమావేశానికి పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.



