నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు

రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన వర్ధమాన సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ న్యాయ పోరాటం, దశాబ్దాల నిరీక్షణ అనంతరం సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డిని దోషిగా తేలుస్తూ, అతనికి విధించిన శిక్షను అనుభవించేందుకు నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది.
సినీ నటి ప్రత్యూష కేసులో ఆమె స్నేహితుడైన సిద్ధార్థ రెడ్డే స్వయంగా విష పదార్థం కోనుగోలు చేసినట్లు తేలిందని, అతడు ముమ్మాటికీ దోషేనని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. 24 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీం ధర్మాసనం.. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డిని ఆదేశించింది. 2002 ఫిబ్రవరి 23న సినీనటి ప్రత్యూష, ఆమె స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించారు.
మరుసటి రోజు ప్రత్యూష మరణించగా, ఆస్పత్రిలో చికిత్స తర్వాత సిద్ధార్థ రెడ్డి కోలుకున్నాడు. ప్రత్యూష మృతిపై పలు అనుమానాలు రావడంతో అప్పటి ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. అప్పట్లో విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు.. 2004 ఫిబ్రవరి 23న సిద్ధార్థ రెడ్డిని దోషిగా తేల్చింది. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఐపీసీ సెక్షన్ 306 కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, 5వేలు జరిమానా విధించింది. ఆత్మహత్యాయత్నం చేసినందుకు ఐపీసీ సెక్షన్ 309 కింద మరో ఏడాది శిక్ష విధించింది.



