చంద్రబాబు కోసం బండ్ల గణేష్ మహా పాదయాత్ర!

Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి అదరగొట్టే నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు గారి కోసం తిరుమల వెంకటేశ్వరస్వామికి చేసిన మొక్కు తీర్చుకోవడానికి షాద్నగర్ నుంచి తిరుమల వరకు మహా పాదయాత్ర చేయనున్నారు. ఈ పవిత్ర ప్రయాణం జనవరి 19న ప్రారంభమవుతుంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ చంద్రబాబు గారికి అభిమాని అని అందరికీ తెలిసిందే. వైసీపీ అధికార హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అయినప్పుడు ఆయన బయటపడాలని, మళ్లీ సీఎంగా ఉండాలని తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడానికి బండ్ల గణేష్ భక్తి ప్రదర్శనకు సిద్ధమయ్యారు. జనవరి 19న తన స్వగృహం షాద్నగర్ నుంచి ఘనంగా పాదయాత్ర ప్రారంభించి కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, భక్తులు పెద్ద ఎత్తున సహకరించనున్నారు. ఈ పాదయాత్ర టాలీవుడ్లో సంచలనం రేపుతోంది.



