బీజేపీ నేత నవనీత్ కౌర్‌కు అసదుద్దీన్ కౌంటర్

మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ..దేశ జనాభా..ముస్లిం కుటుంబాలు అధికంగా పిల్లలను కనడంపై మహారాష్ట్రలో చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ దుమారం రేపుతున్నాయి. దేశం హిందూ మెజారిటీ నుంచి ముస్లిం మెజారిటీ వైపు మళ్లకుండా ఉండాలంటే ఒక్కోజంట కనీసం నలుగురు పిల్లలను కనాలని సినీ నటీ, పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ రాణా అలియాస్ నవనీత్ కౌర్ ఆ మధ్య వ్యాఖ్యలు చేశారు. నవనీత్ వ్యాఖ్యలు మనసులో పెట్టుకున్న అసదుద్దీన్ ఒవైసీ అటు బిజేపీ, ఇటు ఆర్ఎస్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. ఏ మతంలోని భార్యభర్తలైనా పిల్లలను కనేందుకు మీమేమైనా అడ్డు ఉన్నామా? మేము 19 మందిని కంటే మీరు 20 మందిని కనండి అంటూ నవనీత్‌పై అసద్ పవర్ పంచ్‌లు పేల్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీని బాబాగా పోల్చుతూ చేసిన వ్యాఖ్యలూ వివాదానికి దారి తీస్తున్నాయి. తన ప్రసంగంలో చంద్రబాబు పేరునూ అసద్ ప్రస్తావించారు. తనను బీజేపీ బీ అంటూ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, మహారాష్ట్ర డిప్యూటీ అజిత్ పవార్ చేస్తున్న వ్యాఖ్యలనూ అసద్ పొలిటికల్ పంచ్‌లతో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
దేశ జనాభా విషయంలోనే కాదు ఇటు వందేమాతరం విషయంలోనూ మోడీ చెప్పినట్లు తాము వినబోమని వీ ద పీపుల్ అనే కాన్‌స్టిట్యూషన్ మాత్రమే ఫాలో అవుతామని స్పష్టం చేశారు. దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందే అనేది బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ స్లోగన్.అలాగే అధిక సంతానంతో దేశంలో మెజార్టీ జనాభా వాటాను పెంచుకుని రాజ్యాధికారం సాధించే దిశగా ముస్లిమ్స్ ప్రయత్నిస్తున్నారని కొద్దిమంది కాషాయవాదులు చేస్తున్న ఆరోపణ.
దేశంలో జనాభా పెరుగుదల అవసరమని ప్రపంచ గణాంకాలు చెబుతున్నాయని, యంగ్ ఇండియా కావాలంటే దేశంలో జనాభా రేటు పెరగాలని అసద్ అంటున్నారు. మా మతం పెరిగితే తప్పేంటి? మీ మతంలో జనాభా పెంచుకుంటే మీమేమన్నా అడ్డంకిగా ఉన్నామా? అంటూ సెటైరిక్‌గా అసద్ మాట్లాడారు. మహారాష్ట్రలో ఓ ముల్లా తాను నలుగురు పెళ్లాలను చేసుకున్నారని, 19 మందిని కన్నానని, ఇంకా క్యూలో ఉన్నానని చెప్పిన వీడియో వైరల్ అయింది.
ముల్లా వీడియోపై స్పందించిన లోక్‌సభ సభ్యురాలు నవనీత్ కౌర్ దేశంలో ఆందోళన కలిగించే రీతిలో ముస్లిమ్స్ సంఖ్యా బలం పెంచుకునేందుకు నలుగురు పెళ్లాలను చేసుకుంటున్నారని, ఇబ్బడి ముబ్బడిగా పిల్లలు కంటున్నారని ఇది రాబోయే రోజుల్లో హిందూ దేశం కాస్తా ముస్లిం దేశంగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై లోకల్ బాడీ ఎన్నికల ప్రచారం కోసం మహారాష్ట్ర వచ్చిన అసద్..నవనీత్ వ్యాఖ్యలను అస్త్రాలుగా మల్చుకుని ముస్లిం జనాభాపై, దేశ జనాభా పెరుగుదల ఆవశ్యక్తతపై పొలిటికల్ యాంగిల్‌లో కౌంటర్ ఇచ్చారు. అసద్ వ్యాఖ్యలను ఆయన పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్‌ఏ ఇత్తేహదుల్ మస్లిమీన్ వైరల్ చేస్తోంది.
మహారాష్ట్రలోని ముస్లిం సామాజిక ప్రభావిత ప్రాంతాల్లో పోటీ చేస్తున్న మజ్లిస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. మజ్లిస్ పార్టీకి మహారాష్ట్ర లోకల్ బాడీస్‌లో, అసెంబ్లీలో, లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ప్రభావిత స్థాయిలో ఓటు బ్యాంకు ఉంది. అసెంబ్లీలో ఒకరిద్దరు శాసనసభ్యులను కలిగిఉంటోంది. 2019 ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి ఒక లోక్‌సభ స్థానం నుంచి విక్టరీ సాధించింది. ఒకప్పటి హైదరాబాద్ ఎస్టేట్‌లో భాగమైన నేటి మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మజ్లిస్ ప్రభావం చూపుతూ వస్తోంది. సిటీస్‌లో మైనారటీ ఓటు బ్యాంకును తమ గంపగుత్తగా మజ్లిస్ బావిస్తూ వస్తోంది. కొన్నిసార్లు విక్టరీ సాధిస్తోంది, మరికొన్ని సార్లు ఇతర పార్టీలను ఓడిస్తూ వస్తోంది.



