తెలంగాణ

KCR: ఇంతకు ముందు ఓ లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క..

KCR: సమైక్యాంధ్ర పాలనలో పాలమూరు ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా గుండా కృష్ణా నది ప్రవహిస్తున్నా, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు ద్రోహం చేశాయని ఆరోపించారు. పాలమూరుకు రావాల్సిన 174 టీఎంసీల నీటిని అడ్డుకున్నారని, ఏపీ ఏర్పాటు తెలంగాణకు శాపంగా మారిందన్నారు.

ఎస్ఆర్సీ ప్రతిపాదనలను మార్చొద్దని ఉన్నా టీడీపీ, కాంగ్రెస్ కలిసి పాలమూరును దెబ్బతీశాయని చెప్పారు. చంద్రబాబు పాలమూరును దత్తత తీసుకున్నా అభివృద్ధి చేయలేదని, సాగునీరు లేక రైతులు ముంబైకి వలస వెళ్లారని పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు అంజయ్య హయాంలో ప్రారంభమైందని గుర్తుచేశారు.

తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదని, వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతమని తాను ఎప్పుడూ చెప్పానన్నారు. గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి పాలమూరును తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల పనులను తమ హయాంలో వేగవంతం చేశామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వానికి రియల్‌ ఎస్టేట్ తప్ప మరేదీ పట్టడం లేదని, కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేవా అని ప్రశ్నించారు.

రెండేళ్లుగా పరిణామాలను మౌనంగా గమనించానని, ఇప్పుడు తప్పదని స్వయంగా రంగంలోకి దిగుతున్నానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడతామని, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తామని తెలిపారు.

గోదావరి జలాల దోపిడీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడటం లేదని, జలహక్కుల కోసం పోరాటం తప్పదన్నారు. రాష్ట్ర హక్కులను రక్షించుకోవడానికి ఫైట్ చేస్తామని స్పష్టం చేశారు. జంట నగరాల్లో పట్టపగలు హత్యలు, మానభంగాలు జరుగుతున్నా ప్రశ్నించే పరిస్థితి లేదని విమర్శించారు.

తెలంగాణలో క్రైమ్ రేటు 20 శాతం పెరిగిందని, ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. తులం బంగారం ఇస్తామంటూ ఉపన్యాసాలు ఇచ్చి వృద్ధులు, విద్యార్థులను కూడా మోసం చేశారని కేసీఆర్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button