H-1B వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ.. లక్ష డాలర్ల ఫీజు పెంపు

H-1B వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు మరో షాక్ తగిలింది. H-1B వీసా దరఖాస్తులపై ఏకంగా లక్ష డాలర్ల ఫీజును విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి న్యాయస్థానంలో ప్రాథమిక విజయం దక్కింది. ఈ ఫీజు పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేయడంతో, ఇప్పుడు ఈ పోరాటం అప్పీల్ కోర్టుకు చేరింది.
గత సెప్టెంబర్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా H-1B వీసా ప్రోగ్రామ్‌లో భారీ మార్పులు చేశారు. విదేశీ నిపుణులను నియమించుకోవాలనుకునే కంపెనీలు ఒక్కో దరఖాస్తుకు అదనంగా లక్ష డాలర్లు చెల్లించాలని నిబంధన పెట్టారు.
దీనివల్ల అమెరికా కంపెనీలు విదేశీయులకు బదులుగా అమెరికన్లకే ఉద్యోగాలు ఇస్తాయని ట్రంప్ వాదించారు. అయితే, ఈ నిర్ణయం వల్ల టెక్నాలజీ, హెల్త్‌కేర్, విద్యారంగాలు కుప్పకూలుతాయని ‘యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ వాదిస్తోంది. కోర్టు నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో టెక్ కంపెనీలు ఉన్నాయి.



