India vs South Africa: నేడు టీమిండియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్

India vs South Africa: నేడు ధర్మశాల వేదికగా మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి లీడ్‌లోకి వెళ్లాలని టీమిండియా పట్టుదలతో ఉంది. తొలి టీ20 భారత్ గెలిచింది. రెండో టీ20 సౌతాఫ్రికా నెగ్గింది. ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1 సమవుజ్జీలుగా ఉన్నాయి. గత మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శన దారుణంగా ఉంది. ముందుగా బంతితో.. ఆ తర్వాత బ్యాటుతో చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓటమి కంటే భారత ప్లేయర్ల ఆడిన తీరు కాస్త ఆందోళనకరంగానే ఉంది. కాబట్టి, మూడో టీ20లో భారత జట్టు లోపాలను సరిదిద్దుకుని మెరుగుపడాల్సిన అవసరం ఉంది.
టీ20 వరల్డ్ కప్‌కు ఇంకెంతో సమయం లేదు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్ ఫామ్ జట్టును టెన్షన్ పెడుతోంది. కొంతకాలంగా వీరిద్దరూ టీ20ల్లో పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా మారారు. టీ20ల్లో సూర్య హాఫ్ సెంచరీ చేసి ఏడాదవుతోంది. ఈ సిరీస్‌లో సూర్య, గిల్ ప్రదర్శన పేలవంగా ఉంది. సూర్య వరుసగా 12, 5 రన్స్ చేయగా గిల్ 4, 0 పరుగులు చేశాడు. దీంతో వీరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ వీరిద్దరు ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
లేదంటే ప్రపంచకప్ బెర్త్‌లు డౌటే. మరోవైపు, యువ సంచలనం అభిషేక్ శర్మ కూడా ఈ సిరీస్‌లో నిరాశపర్చడం అందరినీ ఆశ్చరిపరుస్తోంది. టీ20ల్లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో స్టార్ అయిపోయిన అతను 17, 17 పరుగులే చేశాడు. అతను కూడా పుంజుకోవాల్సి ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ టాపార్డర్ విఫలమవడం భారత బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మాత్రమే టచ్‌లో ఉన్నారు. జితేశ్, దూబె కూడా పెద్దగా ఆకట్టుకుంది లేదు. మొత్తంగా బ్యాటింగ్ పరంగా భారత జట్టు చాలా మెరుగుపడాలని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.



