సినిమా

Ibomma Ravi: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఐబొమ్మ రవి అరెస్ట్

Ibomma Ravi: ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న పేరు ఐబొమ్మ రవి. ఐబొమ్మ అనే పేరుతో వెబ్ సైట్ క్రియేట్ చేసి ఎన్నో వేల సినిమాలను పైరసి చేశాడు. అప్పటి దాకా చాలా పైరసి వెబ్ సైట్లు పుట్టుకొచ్చాయి. కానీ ఈ రేంజి క్వాలిటీలో సినిమాలు వచ్చేవి కావు. కానీ ఐబొమ్మలో మాత్రం చాలా క్వాలిటీ ప్రింట్ వచ్చేది. అసలు ఇది ఎలా సాధ్యం అన్న ఆసక్తి కలిగేది. అప్పటి దాకా మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్ లాంటి పైరసీ వెబ్ సైట్స్ ఉండేవి కానీ ఈ ఐబొమ్మ భయ పెట్టినంతగా అవి భయపెట్టేవి కావు. ఎందుకంటే ఐబొమ్మలో HD క్వాలిటీలో మూవీస్ వచ్చేవి.

అయితే మొదట్లో ఈ ఐబొమ్మ గురించి పెద్దగా తెలిసేది కాదు. ఇందులో ఉన్న సినిమాలు రిలీజ్ అయ్యాక కొంచెం గ్యాప్ లో పైరసి అయ్యేవి. కానీ మెల్లగా మెల్లగా ఇందులో సినిమాల ప్రైవసీ స్పీడ్ బాగా పెరిగిపోయింది. థియేటర్లలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే సినిమాలు ఇందులో పైరసి అయ్యేవి. ఆ రోజులు కాస్త గంటలుగా మారాయి. సినిమా విడుదల అయిన గంటల వ్యవధి లోనే ఐబొమ్మలో పర్ఫెక్ట్ క్వాలిటీతో దర్శనమిచ్చేవి.

ఈ రేంజిలో ఇంత క్వాలిటీగా సినిమాలు పైరసీ కావడంతో జనాలు ఐబొమ్మకి బాగా అట్రాక్ట్ అయ్యారు. ఈ సైట్ కి వినియోగదారులు రికార్డ్ స్థాయిలో పెరిగిపోయారు. కొత్త సినిమా రిలీజ్ చేతున్నాం అంటే నిర్మాతలు వణికిపోయేవారు. దీంతో పోలీసులు రంగంలో దిగగా, చాలా కాలం పాటు రవిని పట్టుకోలేకపోయారు. దీనిని సైబర్ టీం తో బ్లాక్ చేయించినా కూడా దాని పేరు మార్చి బెప్పంగా మళ్ళీ పైరసీ చెయ్యడం మొదలు పెట్టాడు రవి.

అయినా పోలీసులు ఏమాత్రం వెనకడుగు వెయ్యలేదు. మళ్ళీ ఈ హ్యాకర్ ని పట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. సరిగ్గా ఆ టైం లోనే రవి తన అతి ఆత్మ విశ్వాసాన్ని చూపించాడు. తనని ఎవరు పట్టుకోలేరని, తమది చాలా పెద్ద నెట్వర్క్ అని, ఇంటర్నేషనల్ రేంజిలో ఉందని, తమ దగ్గర తమ యూజర్ల డేటా ఉందని చెప్పాడు. అలాగే ఒక హీరో సహాయం కూడా ఉందని చెప్పాడు. తమని పట్టుకోవాలని చూస్తే ఆ హీరోని, తమ యూజర్ల డేటాని భగ్న పరుస్తామని ఛాలెంజ్ చేశాడు. అలా చాలెంజ్ చేసి ఓ పోస్ట్ ని సోషల్ మీడియాలో పెట్టగా, అది బాగా వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు ఇంకా ప్రయత్నాలు చేశారు. అలా చేస్తుండగానే, రవి తానంతటా తానే వచ్చి ఇరుక్కున్నాడు.

కరేబియన్ దీవుల్లో ఉంటున్న రవి పోలీసుల వలకి చిక్కడం నిజంగా ఓ సినిమా స్టోరీ లా ఉందనే చెప్పాలి. రవి తన భార్యతో విడాకుల కోసం ఫ్రాన్స్ దేశం నుంచి హైదరాబాద్ కి వచ్చాడు. అదే తాను చేసిన తప్పు. తనని ఏమి చెయ్యలేరు అనుకున్న పోలీసులు చాలా ఈజీగా అతన్ని పట్టేశారు. అతన్ని పట్టుకొని నిజ నిజాలు తెలుసుకోగా మైండ్ బ్లాకయ్యే విషయాలు తెలిసాయి.

రవి వల్ల సమాజానికి కూడా బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ రూపంలో తీరని నష్టం జరిగిందని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. సినీ హీరోలు చిరంజీవి, నాగార్జునలతో పాటు దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు దిల్‌రాజు, సురేష్‌ బాబులతో కలిసి పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ, ఇమ్మడి రవిపై ఐటీ యాక్ట్‌, కాపీ రైట్‌ యాక్ట్‌, పలు సెక్షన్ల కింద నాలుగు కేసులు నమోదు చేశామని తెలిపారు.

రవి కొత్త సినిమాల పైరసీ ద్వారా సినీ పరిశ్రమకు నష్టం చేశారని చెప్పారు. వెబ్‌సైట్లో బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ చేస్తున్నాడని, ఆ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలై చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు. రవి వద్ద 1972 నాటి గాఢ్‌ఫాదర్‌ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఓజీ సినిమా వరకు హాలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్‌, ఇతర భాషల సినిమాల పైరేటెడ్‌ కాపీలు 21వేల వరకు ఉన్నాయని తెలిపారు.

ఇక ఇలా పైరసీతో రూ.20 కోట్లు సంపాదిందించాడని, అందులో రూ.3 కోట్లు సీజ్‌ చేశామని వెల్లడించారు. ఐబొమ్మ వెబ్‌సైట్ల ద్వారా లక్షల మంది ప్రేక్షకులను 1విన్‌, 1ఎక్స్‌ బెట్‌ వంటి అక్రమ బెట్టింగ్‌ వేదికల వైపు మళ్లించాడని చెప్పారు. రవి వద్ద 50 లక్షల మంది సబ్‌స్ర్కైబర్ల సమాచారం ఉందని, దీన్ని సైబర్‌ నేరగాళ్లు వాడుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డేటాను ఎవరెవరికి అందించారనే విషయమై లోతైన విచారణ చేపడుతామని చెప్పారు. రవి లేటెస్ట్‌ టెక్నాలజీ వినియోగించి ఉదయం థియేటర్‌లో రిలీజైన సినిమాను సాయంత్రానికే ఐబొమ్మలో పెట్టేవాడన్నారు. ‘పుష్ప 2’ సినిమాను కూడా రవి రిలీజ్‌కు వారం రోజుల ముందు చూసి, డేటాను విదేశాలకు సుమారు 70,000 రూపాయలకు అమ్మేశాడని చెప్పారు.

కొన్ని సినిమాలను అయితే ఓటీటీలో విడుదల కాగానే గంటల వ్యవధిలోనే రెండు వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేస్తున్నారని తెలిపారు. థియేటర్లలో కెమెరాలు పెట్టి, ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో స్ర్కీన్‌ రికార్డ్‌ చేస్తూ ఆ వీడియోలను వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేశారని తెలిపారు. ఇక ఆ రెండు వెబ్‌సైట్లనూ నిలిపివేశామని తెలిపారు. వైజాగ్ కి చెందిన రవి ఇంటికి వెళ్లి మీడియా వారు రవి వాళ్ళ నాన్నని ప్రశ్నించగా, ఆయన దీని గురించి తనకు తెలీదని, రవి ఇలా చేస్తాడని అనుకోలేదని బాధ పడ్డారు. తన కొడుకు తప్పు చేశాడని చెప్పుకొచ్చారు.

మొత్తానికి రవి అరెస్ట్‌తో సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. పెద్ద పెద్ద హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఒక్కసారిగా పైరసి నశించింది జై హో అని గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు ఏదో పెద్ద తీవ్రవాదిని పట్టుకొని జనాలకు మంచి చేసినట్టు మాట్లాడుతున్నారు.

కానీ ఈ ఉత్సాహంలో అందరూ ఒక విషయం మాత్రం పూర్తిగా మరచిపోతున్నారు. అసలు ఈ ఐబొమ్మ లాంటి సైట్లు ఎందుకు పుట్టాయి? ఈ పైరసీ సమస్యకు మూల కారణం ఎవరు? దొంగదోపిడీ చేసింది రవి ఒక్కడేనా లేక ఈ భారీ ధరల వ్యవస్థనా? ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ రోజుల్లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం సినిమాకు వెళ్లాలంటే ఎంతో భారం అవుతుంది. ఖర్చు ఆకాశాన్ని తాకుతుంది. నలుగురు సభ్యుల కుటుంబం ఒక మల్టీప్లెక్స్‌కి వెళ్తే..కనీసం రూ.2,000 నుంచి రూ.2,500 అవుతుంది. ఇది కేవలం ఒక సామాన్య సినిమాకి అయ్యే ఖర్చు మాత్రమే. అదే బిగ్ హీరో సినిమానో పాన్ ఇండియా సినిమానో అయితే మొదటి మూడు రోజులు టికెట్ రేటు రూ.500–800 వరకు ఎగిరిపోతుంది. అంటే ఒక్కసారి పెద్ద హీరో సినిమాకు ఫ్యామిలీతో వెళ్లాలంటే, ఎటు కాదన్న చాలా ఈజీగా రూ.4,000–5,000 ఖర్చు అవుతుంది. దీంతో సినిమా వినోదం అనేది నెలకు ఒక్కసారి కూడా కాదు.. ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే సాధ్యమయ్యే విలాసంగా అయిపోయింది.

పోనీ ఇంత ఖర్చు పెట్టి సినిమా చూస్తే ఆ సినిమా బాగుంటుందన్న గ్యారెంటీ కూడా లేదు. గత రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఒక భారీ మార్పు వచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగయ్యాయి. మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చింది. ఎయిర్ కండిషన్, రిక్లైనర్ సీట్లు, డాల్బీ అట్మాస్ సౌండ్.. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ ఖర్చంతా ఎవరిపైన పడుతుంది? ప్రేక్షకుడిపైనే కదా! మల్టీప్లెక్స్ నిర్వహణ ఖర్చు ఎక్కువ అయినా.. ఆ భారం మొత్తం టికెట్ ధరలోకి తోసేయడం ఎంతవరకు సబబు?
అంతకంటే పెద్ద సమస్య ఏంటంటే.. నటీనటుల రెమ్యూనరేషన్.

రెమ్యూనరేషన్ విషయంలో సినిమా వాళ్లకు అంత అత్యాశ ఎందుకు? ఒక టాప్ హీరో ఒక్క సినిమాకు రూ.100–150 కోట్లు తీసుకుంటున్నాడు. హీరోయిన్ రూ.5–15 కోట్లు, దర్శకుడు రూ.20–50 కోట్లు, టెక్నీషియన్స్, వీఎఫ్ఎక్స్.. ఇలా సినిమా బడ్జెట్ రూ.200–400 కోట్ల వరకు ఎగబాకుతుంది. ఈ డబ్బు రికవరీ కావాలంటే థియేట్రికల్స్ నుంచి కనీసం రూ.300–400 కోట్లు రావాలి. అందుకోసం ఏం చేస్తున్నారు? టికెట్ ధరలను ఆకాశానికి అంటిస్తున్నారు.

సినిమా హిట్ అయితే లాభం ఫ్లాప్ అయితే నిర్మాత రోదిస్తాడు. కానీ రిస్క్ తీసుకునేది నిర్మాత అయినా.. ఆ రిస్క్ భారం మాత్రం ప్రేక్షకుడిపైనే పడుతుంది. కేవలం మూడు గంటల వినోదం కోసం ప్రేక్షకుడు అంత ఎందుకు భరించాలి? భరించడానికి కూడా ఒక అడ్డు అదుపు అనేది ఉంటుంది కదా! ఈ విషయాన్ని సినిమా వాళ్ళు గ్రహించట్లేదు.

ఇంకా థియేటర్ లోపలికి వెళ్తే అక్కడ మరో దోపిడీ. బయట రూ.10–15కి దొరికే కూల్ డ్రింక్ లోపల రూ.100–150, రూ.20 వాటర్ బాటిల్ రూ.100–200, రూ.30–40 పాప్‌కార్న్ రూ.250–400.. ఉంటున్నాయి. అసలు ఏంటి ఈ దోపిడీ? ఈ ధరలు చూస్తే ఎవరికైనా దిగ్భ్రాంతి కలుగకుండా ఉంటుందా? బయట తినడానికి అనుమతి లేదు. లోపల స్నాక్స్ తినాలంటే ఈ ధరలు భరించాలి.

మూడు గంటల వినోదం కోసం ఈ రకమైన దోపిడీ చెయ్యడం ఎంతవరకు న్యాయం? ఇలాంటి ధరలు చూసి, ఈ భారం భరించలేని సామాన్యుడు ఏం చేయాలి? అందుకు ఇంట్లో కూర్చుని ఉచితంగా సినిమా చూడడానికి ఐబొమ్మ, మూవీరూల్జ్, తమిళ్‌రాకర్స్ లాంటి సైట్లు ఉన్నాయి కదా.. అందులో చూస్తే తప్పు ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు.? ఇందుకు జవాబు చెప్పగలరా? అది లేదు.

వినోదం అందరి హక్కు. ఆ వినోదం అందుబాటు ధరలో లభిస్తే ఈ రోజు ఐబొమ్మ రవి లాంటి వాళ్లు ఎందుకు పుడతారు? పైరసీ తప్పు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇది ఒక క్రైమ్. ఒక ఉచ్చు. ఎందుకంటే దీని వల్ల సినిమా వాళ్ళ బిజినెస్ కుప్ప కూలడమే కాదు. సామాన్యులు కూడా తమ పర్సనల్ డేటాని కోల్పోతారు. కానీ ఈ పైరసీ ఎందుకు పుట్టుకు వచ్చింది? దీనికి మూలం ఏంటి? అని కూడా ఆలోచించాలి. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.20–50 టికెట్‌కి సినిమా చూసేవాళ్లం.

ఆ రోజుల్లో పైరసీ ఇంత భారీ స్థాయిలో లేదు. ఎందుకంటే సినిమా చూడటం అందరికీ అందుబాటులో ఉండేది. ఇప్పుడు మల్టీప్లెక్స్ కల్చర్, భారీ రెమ్యూనరేషన్లు, ఆకాశం తాకిన బడ్జెట్లు ఇవన్నీ సినిమాను సామాన్యుడి చేతులకు అందని ద్రాక్షాగా అందనంత దూరంలోకి నెట్టాయి. ఫలితంగా పైరసీ సైట్లు పుట్టుకొచ్చాయి.

ఈ రోజు ఐబొమ్మ రవిని పట్టారు. రేపు మరో రవి పుట్టుకొస్తాడు. ఎందుకంటే సమస్యను మూలంతో సరిచేయలేదు. ఒక వ్యక్తిని జైల్లో వేస్తే సమస్య పరిష్కారం కాదు. ధరలను అదుపులో ఉంచడం, నటుల రెమ్యూనరేషన్‌ను కంట్రోల్ చేయడం, థియేటర్ లోపల ఆహార పదార్థాల ధరలను అందుబాటు స్థాయిలో ఉంచడం.. ఇవన్నీ చేస్తేనే పైరసీపై కచ్చితంగా గెలుపు సాధ్యం అవుతుంది.

ఏది ఏమైనా ఐబొమ్మ రవి చేసింది తప్పు. కానీ ఆ తప్పుకు మూల కారణం ఈ భారీ ధరల వ్యవస్థ, నిర్మాతల అత్యాశ, సామాన్యుడి జేబుపై భారం మోపిన సినీ పరిశ్రమ. ఒక్క రవిని శిక్షిస్తే సమస్య అంతం కాదు. సినిమా అనేది కళ కానీ ఆ కళను వ్యాపారంగా మాత్రమే చూస్తూ, సామాన్యుడిని దోచుకుంటే రేపు ఇంకో రవి తప్పకుండా పుట్టుకొస్తాడు. సినిమా ఇండస్ట్రీ ఒక్కసారి స్వయం పరిశీలన చేసుకోవాలి. మేము కష్టపడుతున్నాం అని చెప్పడం సులువు.

కానీ రూ.200–300 టికెట్ కొనుక్కుని సినిమా చూసే వ్యక్తి కూడా రోజుకి రూ.500–600 సంపాదించడానికి కష్టపడుతున్నాడని గుర్తుంచుకోవాలి. అతని కష్టానికి గౌరవం ఇవ్వాలి. అతని జేబును దోచుకోకూడదు.అప్పుడే నిజంగా పైరసీ అంతమవుతుంది. అప్పుడే సినిమా మళ్లీ ప్రజల సొత్తు అవుతుంది. కాబట్టి ఇకనైనా ఈ దోపిడీ వ్యవస్థ మారుతుందేమో చూద్దాం. ఈ మాటలు ఎవరివో కావో సోషల్ మీడియాలో నెటిజన్స్, ప్రేక్షకులు అంటున్న మాటలు. కొందరు రవిని తప్పు బడుతుంటే కొందరు సపోర్ట్ చేస్తున్నారు. అతన్ని మంచి పనులకు వాడుకోమని సలహాలు ఇస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button