అంతర్జాతీయం

Donald Trump: ట్రంప్ కు షాక్..టారిఫ్ లు చట్ట విరుద్ధమన్న కోర్టు

Donald Trump: టారిఫ్ ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు యూఎస్ కోర్టు షాకిచ్చింది. ట్రంప్‌ విధించిన సుంకాలు చాలా వరకు చట్ట విరుద్ధమని అమెరికా ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. అధ్యక్షుడు ట్రంప్‌ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్‌లను పెంచినట్లు పేర్కొంది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు.

భారీగా విధించిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతానికి పెంచిన టారిఫ్‌లను అక్టోబర్‌ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ నిర్ణయాన్ని యూఎస్‌ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు కోర్టు అనుమతించింది. అప్పీళ్ల కోర్టు తీర్పుపై ట్రంప్‌ సుప్రీంకోర్టులో పోరాడనున్నారు.

ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. కోర్టు పక్షపాతంగా తీర్పు చెప్పిందని విమర్శించారు. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడతానని తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని చివరకు అమెరికాను గెలుస్తుందని ట్రంప్ అన్నారు. కోర్టు చెప్పినట్టు సుంకాలను తొలిగిస్తే దేశ చరిత్రలోనే అదొక గొప్ప విపత్తు అవుతుందని అన్నారు. అమెరికా ప్రస్తుతం ఆర్థికంగా బలహీనంగా ఉందని సుంకాలను మానేస్తే మరింత పడిపోతుందని అన్నారు.

వాణిజ్య లోటును పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి సుంకాలు ఒక్కటే మార్గమని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా నాశనం కాకుండా ఉండాలంటే సుంకాలను విధించాల్సిందేనని అన్నారు. యూఎస్ కార్మికులను కాపాడాలంటేఇక్కడ తయారీదారులను, రైతులను కాపాడాలంటే సుంకాలను విధించాల్సిందేనని చాలా గట్టిగా చెప్పారు. టారిఫ్ లసాయంతో అమెరికాను బలమైన , ధనిక దేశంగా మారుస్తున్నానని ట్రంప్ సమర్ధించుకొచ్చారు

ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టంను అమలులోకి తెచ్చారు. దీంతో అమెరికా వాణిజ్య భాగస్వాములపై భారీగా సుంకాలు విధించారు. అంతకు ముందు బేస్ 10 శాతం ఉండగా దాన్ని 25, 35, 50, 100 అంటూ తన ఇష్టం వచ్చినట్టు పెంచేశారు. కెనడా, మెక్సికో, చైనా లపై అన్నింటికంటే అత్యధికంగా టారీఫ్ లను విధించారు.ఇక భారత్‌పై తొలుత 26 శాతం టారిఫ్‌లు విధించగా, రష్యా నుంచి భారత్‌ చమురును తక్కువకు కొని లబ్ధి పొందుతోందని అనంతరం వాటిని 50 శాతానికి పెంచారు.దీంతో ప్రస్తుతం అమెరికాతో చాలా దేశాలకు వాణిజ్య యుద్ధం నడుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button