అంతర్జాతీయం

ఐదున్నర కోట్ల వీసా హోల్డర్లపై అమెరికా సమీక్ష

అమెరికాలో వీసా కలిగిన విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం కొత్త కఠిన చర్యలు ప్రారంభించింది. విదేశాంగ శాఖ గురువారం ప్రకటించిన ప్రకారం, ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే 55 మిలియన్లు, ఐదున్నర కోట్లకు పైగా వీసా హోల్డర్ల రికార్డులు సమీక్షిస్తోంది. వలస నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా, నేరాలకు పాల్పడ్డా, ప్రజా భద్రతకు ముప్పు కలిగించినా, ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చినా వారి వీసాలను రద్దు చేస్తామని, వారిని అమెరికా నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేసింది. వీసా హోల్డర్లందరిపైనా పరిశీలన ఉంటుందని, వారి సోషల్ మీడియా ఖాతాలు, అమెరికాలో వారు చేసిన నేరాలు అన్నీ పరిశీలనలో ఉంటాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత వీసాలపై చర్యలు మరింత కఠినతరమయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రెండు రెట్లు ఎక్కువ వీసాలు రద్దయ్యాయి. ముఖ్యంగా విద్యార్థి వీసాల విషయంలో గత ఏడాది కంటే నాలుగు రెట్లు ఎక్కువ వీసాలు రద్దయ్యాయి. ఒక్క వారం రోజుల్లోనే 6 వేల విద్యార్థి వీసాలను రద్దు చేసినట్లు అధికారిక గణాంకాలు చూపిస్తున్నాయి. వీటిలో చాలా వీసాలు గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం, దాడులు, ఉగ్రవాదానికి మద్దతు వంటి కారణాలతో చాలా మంది వీసాలు రద్దయ్యాయి. అందులో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే దాదాపు 4వేల విద్యార్థి వీసాలు ఉగ్రవాద సంబంధిత కారణాలతో రద్దు చేశారు.

ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు మద్దతు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న వారిని ఈ జాబితాలో చేర్చారు. వలస చట్టాల అమలులో ట్రంప్ ప్రభుత్వం ఎప్పటిలాగే కఠిన వైఖరి అమలు చేస్తోంది. వీసా దరఖాస్తుదారులపై కూడా కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలని నిబంధన విధించారు. ఈ విధానం ప్రధానంగా అమెరికాలో చదువుతున్న, పనిచేస్తున్న వేలాది విదేశీయులపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా అమెరికాలో వీసాల రద్దు అవుతున్న వారు ఎక్కువ మంది భారతీయులే కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఐటీ నిపుణులు, విద్యార్థులు, రీసెర్చ్ ఫెలోస్, అందరూ ఇప్పుడు అనిశ్చితిలో ఉన్నారు. అమెరికా భద్రత కోసం చర్యలు తీసుకోవడం సహజమే కానీ, వీసా హోల్డర్లందరినీ అనుమానాస్పదంగా చూడడం ఆ దేశ ప్రతిష్ఠకు ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజమైన నేరస్థులను గుర్తించి శిక్షించడం అవసరం కాని, నిరపరాధులపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల అమెరికా-మిత్రదేశాల మధ్య నమ్మకం దెబ్బతినే అవకాశముందంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button