అంతర్జాతీయం

Nikki Haley: భారత్‌తో సంబంధాలను తెంచుకోకండి.. ట్రంప్‌ను హెచ్చరించిన నిక్కీ నిక్కీ హేలీ

Nikki Haley: భారత్‌పై విషం వెళ్లగక్కుతున్న ట్రంప్‌కు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వస్తుంది. భారత్ విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై రిపబ్లికన్ పార్టీ కీలక నేత నిక్కీ హేలీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా ఆ దేశంపై భారీ సుంకాలు విధిస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. చైనాకు ఒకరకమైన మినహాయింపు ఇచ్చి, బలమైన మిత్రదేశమైన భారత్‌తో సంబంధాలను దెబ్బతీయవద్దని ఆమె ట్రంప్‌కు గట్టిగా హితవు పలికారు.

భారత్ రష్యా నుంచి చమురు కొనకూడదన్నది నిజమే. కానీ మన ప్రత్యర్థి అయిన చైనా, రష్యా, ఇరాన్‌ల నుంచి పెద్ద మొత్తంలో చమురు కొంటున్నామని ట్విట్టర్ ద్వారా నిక్కీ హేలీ తీవ్రస్థాయి విమర్శించారు. వారికి 90 రోజుల సుంకాల విరామం ఇచ్చారు. అలాంటప్పుడు చైనాకు మినహాయింపు ఇచ్చి, బలమైన మిత్రదేశమైన భారత్‌తో సంబంధాలను కాల్చుకోవద్దని ఆమె స్పష్టం చేశారు.

రష్యా యుద్ధానికి భారత్ ఆజ్యం పోస్తోందని, మాస్కో నుంచి చమురు దిగుమతులు చేస్తున్నందుకు 24 గంటల్లోగా భారీగా సుంకాలను పెంచుతామని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్, రష్యాలు తీవ్రంగా స్పందించాయి. అమెరికా చర్యలు అన్యాయమైనవి, అహేతుకమైనవి అని భారత అధికారులు ఖండించగా, రష్యా మాత్రం వీటిని బెదిరింపులుగా అభివర్ణించింది.

ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు భారత్ నుంచి ఎగుమతయ్యే ఫార్మాస్యూటికల్స్, పెట్రోలియం ఉత్పత్తులు, టెలికాం పరికరాలు వంటి కీలక రంగాలపై తక్షణ ప్రభావం పరిమితంగానే ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలతో బలమైన భాగస్వామ్యం అత్యంత కీలకమని నిక్కీ హేలీ చాలాకాలంగా వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ట్రంప్ వైఖరిని బహిరంగంగా విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button