అంతర్జాతీయం

రష్యా చమురు కొనుగోళ్లు ఆపుతానని మోడీ ట్రంప్‌కు హామీ ఇచ్చారా?

ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో బల్బ్ వెలుగుతుందన్నట్టుగా ప్రపంచదేశాలను అమెరికా కీ అడించి ఆడించాలనుకుంటుంది. ఇది గతంలో పెద్దన్న అనుకున్నట్టుగా జరిగింది. కానీ ఎల్లకాలం అమెరికా ఆడింద ఆట పాటింది పాట అన్నట్టుగా సాగకపోవచ్చు. ఇదే విషయం తాజాగా రుజువవుతోంది. రష్యా, ఉక్రెయిన్ పై యుద్ధం చేసి ప్రజలను చంపుతుంది కాబట్టి ఆ దేశంతో యుద్ధం చేయొద్దంటోంది అమెరికా. అయితే రష్యా ప్రపంచంలో ఎవరూ ఇవ్వని తక్కువ ధరకు చమురు విక్రయిస్తోండటంతో వేరే ఆల్టర్నేటివ్ లేక, ఇండియా గత రెండళ్లుగా పెద్ద మొత్తంలో రష్యా చమురు కొంటోంది.

అది కూడా బయట మార్గెట్‌లో అందుబాటులో ఉన్న రేటు కంటే కనీసం 30శాతం తక్కువ ధరకు. అయితే రష్యా చమురు కొంటే చూస్తూ ఊర్కోమని అమెరికా ఇండియాను హెచ్చరిస్తోంది. ఇప్పటికే దేశీయంగా నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి తల్లడిల్లిపోతున్న భారతీయులకు చమురు ధరలు పెరిగితే అది మరింత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇలాంటి తరుణంలో తక్కువ ధరకు చమరు కొనడం తప్ప మార్గం లేదని ఇండియా పదేపదే చెబుతోంది. కానీ అమెరికా మాత్రం రష్యా చమురు కొనొద్దని వార్నింగ్ ఇస్తూనే ఉంది. 25 శాతంగా ఉన్న సుంకాలను 50శాతానికి కూడా పెంచింది. ఆపకుంటే వంద శాతానికి కూడా పెంచుతానంది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు భారత్-అమెరికా ఇంధన సంబంధాలపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేయదని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని ట్రంప్ వైట్‌హౌస్‌లో విలేకరులతో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై సెన్సేషన్‌గా మారాయి. ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్న వేళ, రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచాలని అమెరికా ప్రయత్నిస్తుండటంతో ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు రష్యాను కంట్రోల్ చేయడానికేనన్న వ్యూహాత్మక సంకేతాలుగా వినిపిస్తున్నాయి.

అయితే, ఇండియా మాత్రం స్పష్టత ఇచ్చింది. అస్థిరమైన గ్లోబల్ ఇంధన మార్కెట్ పరిస్థితుల్లో దేశ వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇంధన దిగుమతులు అవసరాల ఆధారంగా మాత్రమే నిర్ణయించబడతాయని చెప్పారు. భారతదేశం ఇంధన వనరులను విస్తృతంగా బేస్ చేసుకోవడం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వైవిధ్యభరితంగా కొనుగోళ్లు జరుపుతుందని విదేశాంగ శాఖ ప్రకటనలో స్పష్టం చేసింది. ట్రంప్‌ వ్యాఖ్యల ప్రకారం, మోడీ రష్యా చమురును కొనుగోలు చేయడం ఆపుతారని హామీ ఇచ్చారని, ఇది రష్యాను ఒంటరిచేసే పెద్ద అడుగని ఆయన అభివర్ణించారు. ఇది వెంటనే సాధ్యం కాదు, ఒక ప్రక్రియ, కానీ ఆ ప్రక్రియ త్వరలో పూర్తవుతుంద ట్రంప్‌ అన్నాడు.

అయితే, భారత వైఖరి మాత్రం స్పష్టంగా ఉంది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ పలుమార్లు ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చారు. భారతదేశం తన ప్రజలకు ఉత్తమమైన ఒప్పందం ఆధారంగా చమురు ఉత్పత్తలను సరసమైన ధరకు అందించాలనుకుంటుందని చెప్పారు. యూరప్ దేశాలు తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయని, కానీ ఇండియాను మాత్రం వాళ్లు చెప్పినట్టుగా నడుచుకోమంటున్నాయని ఆయన మండిపడ్డారు.

యూరప్‌ దేశాల ప్రతినిధులు, వారి సమస్యలను ప్రపంచ సమస్యలుగా భావిస్తారని, కానీ ప్రపంచ సమస్యలను యూరప్‌ పట్టించుకోదని జైశంకర్ గతంలోనే వ్యాఖ్యానించారు. భారతదేశం రష్యన్‌ చమురును కొనుగోలు చేస్తూనే ఉండడం అమెరికాకు ఆగ్రహం కలిగిస్తోంది. అసంతృప్తి రేకెత్తిస్తోంది. రష్యాపై ఆర్థిక ఆంక్షలు అమలుచేస్తున్న సమయంలో, భారత్‌ రష్యా నుండి చమురు కొనుగోళ్ల చేయడం ట్రంప్‌ ప్రభుత్వానికి అసహనంగా మారింది.

దేశీయ రాజకీయంగా కూడా ఈ విషయం వేడి పుట్టిస్తోంది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందిస్తూ, ప్రధాని మోడీ ట్రంప్‌ ముందు తలవంచారన్నారు. ట్రంప్‌ నిర్ణయాలు తీసుకుంటారు, మోడీ కేవలం అనుసరిస్తారని ఎక్స్‌ వేదికగా విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ ట్రంప్‌కు భయపడుతున్నారన్నారు. మొత్తం మీద, రష్యా చమురు కొనుగోలు అంశం మళ్లీ ఇండియా-అమెరికా సంబంధాలలో తాత్కాలిక ఉద్రిక్తతను తెచ్చింది.

ఒకవైపు యూరప్ దేశాల ఒత్తిడి, మరోవైపు దేశీయ అవసరాలు ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే మోడీ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. భారత ఇంధన విధానం రియలిస్టిక్‌ దిశలోనే కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. మార్కెట్‌లో ఎవరు చవకగా ఇస్తే వారినుంచే కొనాలన్నదే భారత్ విధానంగా ఉందని వారు విశ్లేషిస్తున్నారు. రష్యన్‌ చమురుపై భారత ఆధారపడటానికి కారణం తక్కువ ధరకు లభించడమేనన్నది వాస్తవం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button