
Maoists: మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ జోన్‌లో పనిచేస్తున్న మావోయిస్టులు లొంగితామంటూ ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎంఎంసి జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. వ్యక్తులుగా కాకుండా జనవరి 1, 2026న తమ బృందం ఆయుధాలను విడిచిపెట్టి సమిష్టిగా లొంగిపోతామని పేర్కొన్నారు. సీనియర్ నాయకులు మల్లోజుల, ఆశన్న లొంగిపోవడం, టాప్ కమాండర్ హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టు సంస్థ బలహీనపడిందని లేఖలో అనంత్ పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వం పదే పదే చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా మిగిలిన కార్యకర్తలు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని ప్రకటనలో మావోయిస్టులు తెలిపారు.
ఆయుధాలను అప్పగించి ప్రభుత్వ పునరావాస కార్యక్రమాన్ని అంగీకరిస్తామన్నారు. కార్యకర్తలు లొంగిపోయే ప్రక్రియను పూర్తి చేసే వరకు సంయమనం పాటించాలని మావోయిస్టులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. జన జీవన స్రవంతిలో కలిసిపోవడానికి కొంత సమయం అవసరమని సూచిస్తూ ఆ బృందం గత వారం, ఒక లేఖను జారీ చేసింది. అంతకు ముందు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని మావోలు కోరారు.



