India: సుంకాలకు బెదరం.. రష్యా చమురు కొంటాం!

India: ఏం చేసుకుంటావో చేసుకో లెక్క తక్కువ కాకుండా వేసుకో అమెరికా ఆంక్షలు, సుంకాలపై ఇండియా ఫుల్ క్లారిటీతో అడుగులు వేస్తోంది. రష్యా నుంచి చమురు కొనొద్దంటూ ఇండియాపై అమెరికా ఒత్తిడి ఇప్పుడు అంతర్జాతీయ అంశంగా మారింది. భారతీయుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, ఇండియా అవసరమైన మేరకు చమురు రష్యా నుంచి కొంటుంది.
తక్కువ రేటుకు వస్తుంది కాబట్టే ఇండియా రష్యా చమురు కొంటోంది ఆంక్షలంటూ దెబ్బకొట్టాలని చూస్తే సహించదు అమెరికా మీరు చెప్పినట్టుగా నడుచుకోవడం అన్నివేళలా కుదరదని స్పష్టం చేస్తోంది. రష్యాతో కేవలం చమురు మాత్రమే కాదు. ఇంకా ఇంకా ఎన్నో సంబంధాలున్నాయంటోంది.
రక్షణ ఉత్పత్తుల కొనుగోలులో ప్రపంచంలోనే ఏ దేశం కంటే భారతదేశమే రష్యా నుంచి ఎక్కువ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుందని తేల్చి చెబుతోంది. మొదట్నుంచి ఇండియాకు నమ్మకమైన మిత్ర దేశంగా రష్యా వ్యవహరిస్తోన్న తరుణంలో రష్యా నుంచి చమురు కొంటే ఇండియాకు మేలు జరుగుతున్న తరుణంలో మీ బెదిరింపులేంటంటోంది ఇండియా.
తాజాగా ఇదే విషయాన్ని రష్యాలో భారత రాయబారి కుండబద్ధలుకొట్టాడు. రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్, TASS సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత కంపెనీలు ఎల్లప్పుడూ ఉత్తమ ఒప్పందం లభించే చోట నుంచే చమురు కొనుగోలు చేస్తాయని తేల్చి చెప్పారు.
భారత్ తన జాతీయ ప్రయోజనాలే ప్రధానమని మరోసారి స్పష్టంగా భారత్ చెప్పింది. 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతే ప్రభుత్వానికి ముఖ్యమని రష్యాలో భారత రాయబారి కుండబద్ధలు కొట్టారు. అమెరికా ఆలోచనల ప్రకారం ఇండియా నిర్ణయాలు తీసుకోదని, అమెరికా ఆడమన్నట్టు ఆడటానికి ఇండియాకు చేతకాదంది. రష్యా ముడి చమురుపై భారత్ చమురు కొనుగోలు చేయడం వల్లే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. కానీ ఇండియా మాత్రం ఆ వాదనను తోసి పుచ్చుతోంది.
తమతోపాటు చైనాతో సహా పలు దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయని ఒక్క ఇండియాపైనే నెపం ఎందుకు వేస్తారని, అనవసర సుంకాలు ఎందుకు వేస్తారని ఇండియా మండిపడుతోంది. ఇండియాను మాత్రమే ఇబ్బంది పెట్టాలన్న అమెరికా ఆలోచన అసమంజసమని రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ స్పష్టం చేసారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా, 25 శాతంగా ఉన్న సుంకాన్ని అమెరికా డబుల్ చేయడంతో ఇండియా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆర్థిక వ్యవస్థ తడబడుతోంది. ఐతే భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనే విషయంలో వెనక్కి తగ్గబోమన్న సంకేతాన్నిస్తోంది.
రష్యాతో డిస్కౌంట్ ముడి చమురు ఒప్పందాలు, రూపాయల్లో చెల్లింపులు, రెండు దేశాల మధ్య వాణిజ్యం, అన్నీ ఇండియాకు వరంగా చెప్పుకోవాల్సి ఉంది. కేవలం చమురు సరఫరా మాత్రమే కాదు, వ్యూహాత్మకంగా రక్షణ, ఇంధన భద్రత, ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ బలోపేతం చేసే భాగస్వామ్యం రష్యాతో కొనసాగడం వల్ల, ఇరు దేశాల సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇదే ధోరణిలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం వ్యాఖ్యానించారు. అమెరికా విమర్శలకు సమాధానమిస్తూ, రష్యా చమురును యూరప్ కొంటోంది, అమెరికా కొంటోంది. మరి భారత్ కొంటే ఎందుకు మీకు నొప్పి అని ఆయన ప్రశ్నించారు. రష్యా వద్ద మీరు చమురు కొనడం ఇష్టం లేకపోతే కొనకండి.
భారత జాతీయ ప్రయోజనాల ప్రకారం ఇండియా ముందుకు వెళ్తుందని ఆయన తేల్చి చెప్పారు. జైశంకర్ వ్యాఖ్యలు ప్రభుత్వ ఆలోచనలను స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ చమురు మార్కెట్లో భారత స్థానం ఈ వివాదం వల్ల మరింత బలపడుతోంది. ఒకవైపు అమెరికా ఒత్తిడి, మరోవైపు యూరప్ వ్యూహాలు నేపథ్యంలో ఇండియా తనకు ఏది అవసరమో అదే చేస్తోంది. రష్యా నుండి తక్కువ ధరల సరఫరా, ఇతర దేశాల నుండి ప్రత్యామ్నాయ కొనుగోళ్లు అవసరం మేరకు శుద్ధి చేసిన ఉత్పత్తుల విక్రయం అన్నీ కూడా భారతీయులకు భద్రతనను కలిగిస్తున్నాయి.



