ఆంధ్ర ప్రదేశ్

ఉమ్మడి ప్రకాశం జిల్లాపై జగన్ ఫోకస్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆయనో సీనియర్ నేత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత బంధువు కూడా ఆ జిల్లాలో నిన్న మొన్నటి వరకు బావా బావమర్దుల ఆధిపత్య పోరులో ఆ నేత కాస్త వెనక్కి తగ్గారు. తనకు గత రెండు ఎన్నికల్లో టికెట్ రాకున్నా సైలెంట్ గా ఉన్నారూ అయితే ఇప్పుడు జిల్లాలో తిరిగి ఆయన జోరు చూపిస్తున్నారు. గతంలో జిల్లాలో వైసీపీని అంతా తానై నడిపిన మాజీమంత్రి బాలినేని జనసేన లోకి వెళ్ళడం మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసిన చెవిరెడ్డి జైల్లో ఉండటంతో ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కులేకుండా పోయింది. దీంతో మళ్ళీ ఆ సీనియర్ నేత జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. అందుకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకు ఎవరా సీనియర్ నేత ఆయన పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి బలమైన నాయకత్వం, క్యాడర్ ఉంది. ఈ జిల్లా నుంచి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత బంధువులు అయిన వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి వంటి నాయకులు ఈ జిల్లాకు చెందిన వారే కావడం ఆ పార్టీకి కలిసి వచ్చింది. అయితే మొదటి నుంచి జిల్లాలో పట్టుకోసం ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో ఈ నేతల మధ్య ఆధిపత్య పోరు మరో స్థాయికి చేరుకుంది.

జగన్ మోహన్ రెడ్డికి బంధువులు, స్వయాన బావా ,బావమర్దులు అయిన సుబ్బారెడ్డి,బాలినేని మధ్య కోల్డ్ వార్ వైసీపీ అధినేతకు అనేక సార్లు చిక్కులు తీసుకువచ్చింది. ఈ పరిణామాల నేపద్యంలో జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లా బాధ్యతలు బాలినేనికి అప్పగించారు. అలాగే సుబ్బారెడ్డికి వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు.

దీంతో జిల్లాలో ఆధిపత్య పోరుకి జగన్ చెక్ పెట్టినట్లు అయింది. అయితే ఆ ముచ్చట కూడా ఎంతో కాలం కొనసాగలేదు. జగన్ రెండో విడత కేబినెట్ విస్తరణలో బాలినేనికి చోటు దక్కక పోవడంతో మళ్ళీ బాలినేని అలకపాన్పు ఎక్కడం మొదలు పెట్టారు. అదే సమయంలో తిరిగి జిల్లా రాజకీయాల్లో వైవీ సుబ్బారెడ్డి జోక్యం చేసుకోవడం మొదలు పెట్టారు.

అసలే మంత్రి పదవి పోయింది. దీనికి తోడు తన రాజకీయ ప్రత్యర్థి అయిన సుబ్బారెడ్డికి జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం బాలినేనికి నచ్చలేదు. ఇలా అలకలు,అసంతృప్తుల మధ్యనే 2024 ఎన్నికల వరకు నెట్టుకొచ్చారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత ఆయన జగన్ కి, వైసీపీ కి గుడ్ బై చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

2014 ఎన్నికల్లో సుబ్బారెడ్డి వైసీపీ తరుపున ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో సుబ్బారెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వలేదు జగన్. పార్టీని బలోపేతం చేయడం కోసం పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి పెట్టాలని సూచించారు.అందుకు సుబ్బారెడ్డి కూడా ఒకే చెప్పారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో వైవీకి ముందుగా టీటీడీ చైర్మన్, ఆ తరువాత రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చారు వైసిపి అధినేత. ఇక 2024 ఎన్నికల్లో అయినా ఎంపీగా పోటీ చేయాలని సుబ్బారెడ్డి భావించారు.

2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీ లో చేరడంతో ఎంపీ సీటు సుబ్బారెడ్డి కి దక్కుతుంది అని ఆయన అనుచరగణం భావించింది. అయితే అనూహ్యంగా ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి పేరుని ఖరారు చేశారు జగన్. దీంతో వైవీకి మరోసారి నిరాశ తప్పలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం కుంభకోణంలో చెవిరెడ్డినీ అరెస్టు చేసింది. అటు బాలినేని పార్టీ మారడం ఇటు చెవిరెడ్డి జైల్లో ఉండటంతో జిల్లాలో పార్టీని బలంగా నడిపే నాయకుడు లేకుండా పోయారు.

ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు జగన్. అయితే భూచేపల్లిని మద్యం కుంభ కోణం కేసులు వెంటాడుతున్నాయి. మరోవైపు ఆశించిన స్థాయిలో ఆయనకు జిల్లా నేతలు,క్యాడర్ నుంచి మద్దతు లభించడం లేదు. ఈ పరిణామాల నేపద్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీని తిరిగి గాడిలో పెట్టే బాధ్యతలు ఎంపీ సుబ్బారెడ్డికి, జగన్ అప్పగించారు అనే టాక్ నడుస్తుంది.

జిల్లాలో సుబ్బారెడ్డిని ఇంతకాలం వ్యతిరేకించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. దీంతో సుబ్బారెడ్డికి జిల్లాలో ఎదురు నిలిచే నాయకుడు ఎవరు లేకపోవడంతో మళ్ళీ సుబ్బారెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లా పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. పార్టీని బలోపేతం చేసే క్రమంలో గతంలో వైసీపీకి దూరం అయిన వారిని, అధికారంలో ఉండగా సరైన ప్రాధాన్యం దక్కక సైలెంట్ అయిన నేతలను తిరిగి పార్టీకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ నేత ఒకరిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. గతంలో ఆ మాజీ ఎమ్మెల్యే కూడా మాజీమంత్రి బాలినేని కి వ్యతిరేకంగా పోరాటం చేశారు. గతంలో జగన్ మోహన్ రెడ్డి పొగాకు రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు.

ఆ పర్యటన విజయవంతం చేయడంలో సుబ్బారెడ్డి కీలకంగా పని చేశారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి వైఎస్ఆర్ హయాం నుంచి సుబ్బారెడ్డి కి జిల్లాలో మంచి పేరు ఉంది. పార్టీలకు అతీతంగా అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన స్పీడ్ కి కొంత బ్రేకులు పడ్డాయి. అయితే మళ్ళీ జగన్ ఆయనకే పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు ఇవ్వడంతో జిల్లాలో మళ్ళీ వైసీపీకి పునర్వైభవం వస్తుందని ఆశిస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button