KP Sharma Oli: నేపాల్‌లో కొనసాగుతున్న హింస.. ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా

KP Sharma Oli: సోషల్ మీడియాపై బ్యాన్.. ఏకంగా ప్రధాని రాజీనామా వరకు వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకతను కంట్రోల్ చేసే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఏకంగా పదవినే కోల్పోయేలా చేసింది. నేపాల్ దేశంలోని కుర్రోళ్లు.. ఇప్పుడు ప్రపంచానికి కొత్త నిర్వచనం చెప్పటం కాదు. ఎన్నో కొత్త అంశాలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసినప్పటికీ.. ఆందోళనలకు మాత్రం తెరపడలేదు. పందొమ్మిది మంది మరణించడంతో దానిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయినా ఆందోళనకారులు ఇప్పటికీ నేపాల్ లో వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. అధ్యక్షుడు, ప్రధానిమంత్రి నివాసాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. కచ్చితంగా నేతలు రాజీనామా చేయాల్సిందేనని అంటున్నారు. దీంతో.. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ దేశాన్ని వీడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో.. నేపాల్ మరో బంగ్లాదేశ్, శ్రీలంకలా మారుతుందా..? అనే అనుమానం కలుగుతుంది. అసలు నేపాల్‌లో ప్రస్తుత పరిస్థితి ఏంటి..?
హిమాలయ దేశం నేపాల్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినా ఆందోళనకారులు ఏ మాత్రం శాంతించలేదు. నిన్నటి నుంచి మొదలయిన ఆందోళనలు ఇంకా ఆగడం లేదు. నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఉప ప్రధాన మంత్రి రఘువీర్ మహాసేత్ నివాసంపై నిరసనకారులు రాళ్లు రువ్వుతున్నారు. రాజధాని ఖాట్మండ్‌లో అధ్యక్షుడు, ప్రధానమంత్రి నివాసాలను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువత, వారిని నివాసాలకు నిప్పుపెట్టారు.
ప్రదర్శనకారులు అనేక మంది రాజకీయ నేతల ఇంటిపైకి చొరబడ్డారు. నేపాల్ ప్రధాని కెపి ఓలి, కమ్యూనికేషన్ మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ ప్రైవేట్ నివాసాన్ని తగల బెట్టారు. అలాగే.. నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా నివాసాన్ని చుట్టుముట్టి ఆయన ఆస్తులకు ఆందోళన కారులు నిప్పుపెట్టారు. నిరసనకారులు రాజధాని రోడ్లను దిగ్బంధించారు. దీంతో నేపాల్ లో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది.
టైర్లను తగులబెట్టడంతో పోలీసులు టియర్ గ్యాస్‌తో ప్రయోగించారు. ఈ క్రమంలో బలగాలకు-ఆందోళనకారుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. నేపాలీ మాజీ ప్రధానులు ప్రచండ, షేర్ బహదూర్ దేవుబా, ఇంధన మంత్రి దీపక్ ఖడ్కా ఇళ్లను నిరసనకారులు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దాంతో ఆ దేశ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని తెలుస్తోంది. ప్రధాని ఓలి దుబాయ్ కు వెళ్లేందుక విమానాన్ని కూడా సిద్ధం చేసుకోవడంతో ఆయన దేశం విడిచి వెళ్లిపోతారంటున్నారు.
అయితే జరుగుతున్న ఆందోళనలపై ఈరోజు సాయంత్రం అఖిలపక్ష సమావేశాన్ని ఓలి నిర్వహిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని ప్రధాని ఓలి కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితికి అర్థవంతమైన ముగింపుకు సంబంధిత పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. దీనికి ముందు ప్రధాని కేపీ శర్మ ఓలీ నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్‌తో మాట్లాడారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ క్లిష్ట పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు, ప్రధాని నివాసం నుంచి సురక్షితంగా వెళ్లిపోయేందుకు మిలిటరీ సహాయం కావాలని ఆయన అడిగినట్లు తెలిపాయి.
అయితే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఓలీకి ఆర్మీ చీఫ్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలను సైన్యం అదుపులోకి తీసుకువస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. ఓలీ రాజీనామా చేస్తే.. మిలిటరీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ తరుణంలోనే రాజీనామా ప్రకటన వెలువడింది.
దేశంలోని అస్థిర పరిస్థితుల వేళ .. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని విమానాలను రద్దు చేశారు. 300 మంది సైనికులను అక్కడ మోహరించారు. మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ వద్ద హెలికాప్టర్ల కదలికలు కనిపిస్తున్నాయి. అలాగే రాజధాని కాఠ్‌మాండూలోని ఆర్మీ బ్యారక్స్‌లోకి వీఐపీలను తరలిస్తున్నారు. మరోవైపు నేపాల్ నెలకొన్న పరిణామాలపై భారత్ విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపింది. ఆందోళనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నేపాల్ తమకు అత్యంత సన్నిహిత దేశమని, శాంతియుత మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సమయంలో అక్కడ నివసిస్తున్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.
అయితే.. ఇది పైకి చూడ్డానికి ఇది సోషల్ మీడియా హ్యాండిల్స్ పై నిషేధంగా కనిపించొచ్చు. కానీ లోతుగా చూస్తే, దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను బ్లాక్ చేస్తామని సెప్టెంబర్ 4న ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ ప్రకనట వెనక స్పష్టమైన రాజకీయ కారణాలున్నాయి. నేపాల్ లో కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు వైరల్ అవుతూ వచ్చాయి. వీటిలో ముఖ్యమైనది రాజకీయ నాయకుల వారసుల పోస్టులు. పొలిటికల్ నెపోకిడ్స్ అంశం నేపాల్ లో వైరల్ గా మారింది. కొంతమంది రాజకీయ నేతల పిల్లలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కేవలం పొలిటికల్ నెపోకిడ్స్ వ్యవహారాలు మాత్రమే కాదు, ప్రభుత్వానికి సంబంధించి అవినీతిగా చెప్పే కొన్ని ఒప్పందాలు కూడా వైరల్ అయ్యాయి. 2017లో ప్రభుత్వ రంగసంస్థ నేపాల్ ఎయిర్ వేస్, 2 విమానాల్ని కొనుగోలు చేసిన ఒప్పందం వెనక పెద్ద అవినీతి జరిగిందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపించింది. ఇలా చెప్పుకుంటూపోతే మరో 2-3 కీలకమైన అంశాలు కూడా కనిపిస్తాయి. వీటిలో మరో ముఖ్యమైన అంశం, నేపాల్ లో వ్యవసాయ రంగం. ఈ రంగాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం మానేసిందంటూ సాక్ష్యాలతో సహా కొన్ని పోస్టులు దర్శనమిచ్చాయి.
ఇక పన్ను చెల్లింపుదారుల డబ్బును, రాజకీయ కుటుంబాలు వృధా చేస్తున్నాయంటూ రెడ్డిట్ తో పాటు పలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగింది. దానికి లింక్ గా #PoliticiansNepoBabyNepal అనే హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా వైరల్ అయింది. ఇవన్నీ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఏకంగా సోషల్ మీడియా హ్యాండిల్స్ పై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీనికి అక్కడి ప్రభుత్వం కొన్ని లాజిక్స్ కూడా చెప్పడం మొదలుపెట్టింది. యాప్‌లు నేపాల్‌లో ఆదాయాన్ని పంచుకోవాలి. పన్ను చెల్లించాలి మరియు. జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే నియమాల పరిధికి లోబడి పనిచేయాలి అంటూ స్వయంగా ప్రధాని ప్రకటించడం నిరసనలకు ఆజ్యం పోసింది.ఇలా సోషల్ మీడియాపై నిషేధం వెనక చాలా కథ నడిచింది. దీనికి అక్కడ ప్రతిపక్షాలు ఆజ్యం పోశాయి. ఫలితంగా పెద్ద ఎత్తున యువత రాజధానిలో నిరసనకు దిగడం, హింసాత్మక ఘటనల్లో పలువురు మరణించడం జరిగాయి. దీంతో ఏకంగా నేపాల్ హోం మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరో 2 రోజుల్లో నేపాల్ రాజకీయాలు పూర్తిస్థాయిలో మారబోతున్నాయి.
బంగ్లాదేశ్‌లో ఆ దేశ ప్రజలు చేసిన ఉద్యమాన్ని గుర్తు చేస్తున్నారు. 2024 బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వంపై జరిగిన ఆందోళనలు, ఆమె రాజీనామాకు దారితీసిన విద్యార్థుల ఉద్యమం కీలకమైనవి. ఈ ఉద్యమాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, పౌర హక్కుల ఉల్లంఘన, అవినీతిపై ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబించాయి. ఈ ఉద్యమాల్లో ముఖ్యంగా యువత, విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు, సోషల్ మీడియాను నిరసనలకు వేదికగా ఉపయోగించారు. ఈ ఉద్యమాల తీవ్రత, యువత భాగస్వామ్యం ఇప్పుడు నేపాల్‌లో కనిపిస్తున్న నిరసనలతో పోలిక ఉంది.
బంగ్లాదేశ్, నేపాల్ రాజకీయ వ్యవస్థలు, చరిత్రలో కొన్ని తేడాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ సుదీర్ఘ కాలం ఒకే కుటుంబ అధికారంలో ఉంది. అయితే నేపాల్‌లో తరుచూ ప్రభుత్వాలు మారే సంకీర్ణ వ్యవస్థ ఉంది. బంగ్లాదేశ్‌లో ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక చర్యలు, మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నేపాల్‌లో ఇప్పటి వరకు హింస, మరణాలు సంభవించినా, నిరసనల స్వభావం పూర్తిగా భిన్నంగా ఉంది.
ఇప్పటివరకు అది ప్రభుత్వ వ్యతిరేక నిరసనగా మాత్రమే కొనసాగుతోంది. నేపాల్‌లో జరుగుతున్న నిరసనలు బంగ్లాదేశ్ మాదిరిగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజల ఆగ్రహాన్ని సూచిస్తున్నాయి. ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చి, బంగ్లాదేశ్ స్థాయిలో పెనుమార్పులకు దారితీస్తాయా అనేది చెప్పడం కష్టం. అయినప్పటికీ, యువతలో పెరిగిన చైతన్యం, సోషల్ మీడియాను నిరసనల సాధనంగా ఉపయోగించడం భవిష్యత్తులో నేపాల్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
మొత్తానికి హిమాలయ దేశం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వంపై జరిగిన ఆందోళనలు, ఆమె రాజీనామాకు దారితీసిన విద్యార్థుల ఉద్యమం కీలకమైనవి. ఇప్పుడు యువత రోడ్లెక్కి చేస్తున్న నిరసనలు.. నేపాల్‌లో హింసాత్మకంగా మారాయి. దీంతో… నేతలంతా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే ప్రధానితో సహా దాదాపు అరడజను మంది మంత్రులు రాజీనామాలు చేశారు. పరిస్థితులు చేజారిపోవడంతో ప్రభుత్వ పెద్దలు అలర్ట్ అయ్యారు.



