Kakinada Port: కాకినాడ యాంకరేజ్ పోర్టుపై ఎఫెక్ట్..?

Kakinada Port: పావలా కోడికి ముప్పావలా మసాలా అన్నట్లుంది కూటమి సర్కారు వ్యవహారం. సీజ్ ది షిప్ ప్రభావంతో బియ్యం లోడింగ్ అంతా ఇతర రాష్ట్రాల పోర్టులకు తరలిపోవడంతో రద్దీగా ఉండే కాకినాడ యాంకరేజ్ పోర్టు కళాహీనంగా మారింది. బియ్యం దొంగలు ఎవరో ఇప్పటికీ పట్టిస్తామని చెప్పిన వారికి తెలియదు పట్టుకున్న వారికి తెలియదు.
వేలాది కార్మికుల ఉపాధి మాత్రం కోల్పోవాల్సి వచ్చింది. పోనీ బియ్యం రవాణా ఆగిందా అంటే మన కాకినాడ పోర్ట్ నుండి కాకుండా ఒరిస్సా కి తరలిపోయింది. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వాణిజ్య వర్తకం మందగమనంలో సాగుతోంది.
అధికారం ఉంది కదా అని తెలిసీతెలియని చర్యలు చేపడితే ఏమవుతుందో కాకినాడ పోర్టు ఉదాహరణగా నిలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అందించే బియ్యం అక్రమమార్గం పడుతోందని కాకినాడ పోర్టు ద్వారా రవాణా అవుతుంది అంటూ కూటమిలోని పార్టీలు పదే పదే పలు ఆరోపణలు చేశాయి. అయితే దీనిపై తీసుకోవలసిన చర్యలు సరిగ్గా లేకపోవడమే ఇప్పుడు యాంకరేజ్ పోర్టు ఖాళీ అవడానికి ప్రధాన కారణం.
కాకినాడ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి బియ్యం అక్రమ రవాణా దందాకు మూల కారణమని కూటమి పార్టీలు భావించాయి. చంద్రశేఖర్ రెడ్డి వ్యాపారాన్ని పడగొట్టాలి అంటే ఈ అక్రమ బియ్యం దందాపై చర్యలు తీసుకోవాలని రంగంలోకి దిగింది అధికార యంత్రాంగం. అయితే వ్యాపారం చేసే వారికి అందులో లొసుగులు తెలియకుండా ఉంటాయా ఆ మాత్రం సూక్ష్మాన్ని గ్రహించలేకపోయింది ప్రభుత్వం.
కాకినాడ యాంకరేజ్ పోర్ట్ లో జరుగుతున్న లోడింగ్ , అన్లోడింగ్ వివరాలు తెలుసుకున్న అధికార యంత్రాంగం హుటాహుటిన వెళ్లి తనిఖీలు నిర్వహించింది. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బోటుపై వెళ్లి షిప్పును తనిఖీ చేద్దామని ప్రయత్నం చేశారు. అయితే షిప్ ఎక్కడానికి పర్మిషన్ లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవంటూ కవర్ చేసుకున్నారు.
తర్వాత సీజ్ ది షిప్ అంటూ అధికారులకు స్ట్రాంగ్ గైడ్లైన్స్ ఇచ్చారు. షిప్పును సీజ్ చేసే అధికారం తమకు లేదని తెలిసినా అధికారులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. అందులో ఉన్న సరుకంతా అన్లోడింగ్ చేసి సీజ్ చేశారు. తర్వాత మిల్లర్లు , ఎక్స్పోర్టర్లు కోర్టును ఆశ్రయించి పెనాల్టీ కట్టి తిరిగి సరుకు పట్టుకుపోయారు. షిప్పుని కదలకుండా ఉంచినందుకు అధికార యంత్రాంగం పెనాల్టీ కూడా చెల్లించవలసి వచ్చింది.
అయితే అసలు కథ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. దేశం నలుమూలల నుండి వచ్చిన రైస్ కాకినాడ పోర్టు నుండి నిత్యం ఐదారు షిప్పులకు పైగా లోడింగ్ అయ్యేది. వేలాది కార్మికులు పనిచేసేవారు . వందలాది లారీలు యమ వేగంగా లోడింగ్ , అన్లోడింగ్ కార్యకలాపాలు నిర్వహించేవి. అయితే సీజ్ ది షిప్ ప్రభావంతో ఆ పరిస్థితి ఇప్పుడు కనబడడం లేదు.
అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఆవేశంలో తాము చేసిన పని తప్పని తెలుసుకున్నా పైకి చెప్పలేక లోడింగ్, అన్లోడింగ్ పై అనేక ఆంక్షలు పెట్టింది. దీంతో ఎక్స్పోర్టర్లు , పలు కంపెనీలు ఈ అంశాలను తట్టుకోలేక ఇతర రాష్ట్రాల పోర్టులకు తమ కార్యకలాపాలను మార్చేశారు. సందట్లో సడేమియా అన్నట్టు లోడింగ్ కి వచ్చిన లారీలపై పౌరసరఫరాల శాఖ అధికారులు చెక్ పోస్ట్ పేరుతో వెయ్యి రూపాయల అనధికార టాక్స్ విధించారు. బాగానే వసూలు చేసుకున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పొక్కడంతో రాత్రికి రాత్రి అనధికార చెక్ పోస్ట్ ని ఎత్తివేశారు. ప్రస్తుతం ఆదాయం లేక పౌరసరఫరాల శాఖ అధికార యంత్రాంగం విలవిల్లాడిపోతున్నారు.
అయితే మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్గా చేసిన సీజ్ ది షిప్ ఇప్పుడు బెడిసి కొట్టింది. చంద్రశేఖర్ రెడ్డి కూడా తన పేరుపై ఎక్కడా రైస్ వ్యాపారం గాని , మిల్లులు గాని లేకుండా ముందుగానే జాగ్రత్తపడ్డారు. కేవలం గోడౌన్ మాత్రమే అద్దెకిస్తూ ఈ వ్యాపారం తన అనుచరులు , ఇతరులతో చేయించారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన చర్యలు చంద్రశేఖర్ రెడ్డికి ఏ మాత్రం నష్టాన్ని కలిగించలేకపోయాయి .
అయితే ఈ సీజ్ ద షిప్ వల్ల పోర్టు కార్మికులు, వాహన యజమానులు , కాకినాడ పరిసర ప్రాంతాల్లో పోర్టు అనుసంధానంగా నడిచే వ్యాపారాలపై మాత్రం ప్రభావం చూపాయి. అంతేకాకుండా ఈ సీజ్ ది షిప్ తర్వాత చేపట్టిన చర్యలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఎవరు దీనికి బాధ్యులు వారిపై ఏం చర్యలు తీసుకున్నారో కూడా తెలీదు. ప్రభుత్వం కొండను తవ్వి ఎలకను పట్టినట్లైంది.



