ఆంధ్ర ప్రదేశ్

Vijayawada: విజయవాడలో 72 అడుగుల మట్టి డూండి గణేష్

Vijayawada: వినాయకుడి పేర్లలో ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. డూండీ వినాయకుడు. ఈ పేరు ఎందుకు వచ్చిందో, ఆయన పాత్ర ఏమిటో పురాణాల్లో విశేషంగా చెప్పబడి ఉంది. డూండీ అంటే అన్వేషణ. భక్తుల కోసం ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే నాలుగు ఫలాలను వెతికి ఇచ్చే శక్తి ఆయనది. అందుకే బ్రహ్మదేవుడు ఆయనకు ఆ శక్తిని ప్రసాదించాడని పురాణాలు చెబుతున్నాయి.

ఒకప్పుడు కాశీని దివోదాసు అనే రాజు పాలించేవాడు. ఆ సమయంలో శివుడు కాశీని విడిచి మందర పర్వతానికి వెళ్లిపోయాడు. శివుడిని తిరిగి కాశీకి రప్పించేందుకు సూర్యుడు, యోగినులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ కష్టమైన పనిని వినాయకుడికి అప్పగించాడు.

విజ్ఞేశ్వరుడు జ్యోతిష్య రూపంలో కాశీ రాజును కలిశాడు. రాజు మనసు చదివి, ఇప్పుడు నీకు మోక్షం పొందే సమయం వచ్చిందని తెలిపాడు. త్వరలోనే ఉత్తర దేశం నుంచి ఓ బ్రాహ్మణుడు వచ్చి నీకు ఉపదేశం చేస్తాడని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు అసలు విష్ణుమూర్తే. ఆయన దివోదాసునికి రాజ్యపాలనపై విరక్తి కలిగించి, శివలింగాన్ని ప్రతిష్ఠ చేయించి, చివరికి రాజును మోక్షానికి చేర్చాడు.

ఈ సంగతిని ఆకాశవాణి ద్వారా తెలుసుకున్న శివుడు ఆనందపడి మందర పర్వతాన్ని విడిచి తిరిగి కాశీకి వచ్చాడు. తనను తిరిగి కాశీకి రప్పించినందుకు డూండీ వినాయకుడిని స్వయంగా శివుడు స్తుతించాడు. అందువల్ల ప్రతిరోజూ డూండీ వినాయకుడిని దర్శిస్తే మంచి బుద్ధి, సమయస్ఫూర్తి కలుగుతుందని వరమిచ్చాడు.

కాశీలో 56 రూపాల్లో గణపతి పూజలు అందుకుంటారు. వాటిలో అత్యంత మహిమాన్వితమైన రూపం డూండీ వినాయకుడు. అదే డూండీ గణపతి ఇప్పుడు విజయవాడ భవానిపురంలో కూడా అత్యంత విశిష్టంగా కొలువై ఉన్నాడు. విజయవాడ డూండీ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని నిర్మించారు. 45 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవు గల బలమైన ఐరన్ ఫ్రేమ్‌పై విగ్రహం కట్టారు. 60 రోజులపాటు 50 నుంచి 60 మంది కూలీలు రాత్రింబగళ్లు శ్రమించారు.

విగ్రహ రూపకల్పనలో స్వామివారి ఆయుధాలు, రత్నమాల, చేతిలో పూర్ణకుంభం అన్నీ స్పష్టంగా కనిపించేలా తీర్చిదిద్దారు. స్వామి వారికి రెండు వైపులా – ఒకవైపు కన్యకా పరమేశ్వరి అమ్మవారు, మరోవైపు శివుడు విగ్రహం ఏర్పాటు చేశారు. పర్యావరణానికి హాని కలగకుండా వాటర్ కలర్స్తోనే రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు.

72 అడుగుల విగ్రహాన్ని నేరుగా నిమజ్జనం చేయటం అసాధ్యం. అందుకే ముందుగానే ప్రత్యేక ప్లాన్ చేశారు. విగ్రహంలోనే 1500 మీటర్ల పైప్‌లైన్ అమర్చి, స్ప్రింక్లర్లు జోడించారు. పండుగ ముగిసిన తర్వాత మోటార్ల ద్వారా నీరు పంపించి, లోపలినుంచే విగ్రహం కరిగేలా చేస్తారు. విజయవాడలోని ఈ 72 అడుగుల డూండీ వినాయకుడు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం, పర్యావరణ హితమైన ఆచరణకు ఉదాహరణ. కాశీలో శివుడిని తిరిగి రప్పించిన మహాగణపతే ఇప్పుడు విజయవాడలో వేలాది భక్తుల మనసులను గెలుచుకుంటున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button