Delhi Blast: ఢిల్లీ బాంబు పేలుడు కేసులో రెడ్‌కారు డ్రైవర్ అరెస్టు

Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో తాజాగా మరో అరెస్ట్ చోటు చేసుకుంది. పేలుడు కేసులో ప్రధాన అనుమానితుడైన డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న డీఎల్10సీకే0458 అనే ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాలోని ఖండవలి గ్రామంలో కనుగొన్నారు. అయితే, ఆ కారును అక్కడ పార్క్ చేసిన వ్యక్తిని ఫరీదాబాద్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అతడిని ఫహీమ్‌గా గుర్తించారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది.
మరోవైపు ఎర్రకోట వద్ద పేలుడుతో సంబంధం ఉన్న మూడో కారు కోసం దర్యాప్తు సంస్థలు వేట కొనసాగిస్తున్నాయి. ఉగ్రకుట్ర కోసం మూడు కార్లు వాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును ఫరీదాబాద్‌లో గుర్తించారు. ఇప్పుడు మూడో కారు మారుతీ బ్రీజా కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
ఆ కారు ఆచూకీ చిక్కడం లేదు. నిందితులు ఆ మూడో కారును తప్పించుకోవడం కోసం వాడాలని భావించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు సంస్థలకు చెందిన బృందాలు ఆ కారు కోసం వేట కొనసాగిస్తున్నాయి. మారుతీ బ్రీజా కారును గుర్తించేందుకు ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంతో పాటు సమీప రాష్ట్రాల్లోనూ పోలీసులు వెతుకుతున్నారు.



