Weather Update: నేటి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది. మరోవైపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్ష పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. అలాగే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.



