ఢిల్లీలో భారత్–అమెరికా వాణిజ్య చర్చలు

India-US: టారిఫ్‌ల ట్రంప్ భారత్ దారిలోకి వస్తున్నాడా? 50 శాతం సుంకాలతో మోత మోగించిన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్..భారత ప్రధాని మోడీ భయపడకపోవడంతో గేమ్ చేంజ్ చేశారా? ఇండియా-రష్యా-చైనా జతకట్టి వరల్డ్ బెస్ట్ టీమ్‌గా మారితే అమెరికాకు భవిష్యత్ లేదనే భయం ట్రంప్‌లో పెరుగుతోందా? భారత్ మా నుంచి చేజారి నక్కజిత్తుల చైనా చేతికి చిక్కిందని వ్యంగాస్త్రాలు సంధించిన ట్రంప్ ఆ తర్వాత మోడీ ఈజ్ మై బెస్ట్ ప్రెండ్ అని ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత మోడీ రీ ట్వీట్ చేయడంతో పరిస్థితిలో మార్పు వచ్చినట్లేనా అనే చర్చ మొదలైంది. ఫ్రెండ్షిప్ ప్రెసిడెంట్ ట్రంప్, ప్రైమ్ మినిస్టర్ మోడీ మధ్యనా లేదంటే అమెరికా భారత్ మధ్య సంబంధాలు చిగురిస్తాయా అనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
గ్లోబలైజేషన్ ఎరాలో ప్రతీ దేశానికి మరో దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు సర్వసాధారణం. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్న దేశం తన భాగస్వామ్య దేశంతో వాణిజ్య లోటుతో ఉన్నట్లు లెక్క. ఆ లెక్కను సరిచేసుకునేందుకు, వాణిజ్యాన్ని పెంపొందించుకునేందుకు దేశాల మధ్య చర్చలు జరగడం సర్వసాధారణం.
అయితే అమెరికా అగ్రరాజ్య హోదాలో మిగతా దేశాలను తన దారిలోకి తెచ్చుకునేందుకు చేయని జిమ్మిక్కులు ఉండవు. నేరుగా ఆంక్షలు విధించడం, లేదంటే మిగతా దేశాలతో భయపెట్టించడం పెద్దన్నకు బాగా తెలిసిన విద్య. రెండోసారి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాక ట్రంప్ తన విశ్వరూపం చూపిస్తే అమెరికా ఫస్ట్ పేరుతో మాట వినని దేశాలపై టారిఫ్ పేరుతో కొడుతున్న దెబ్బ అంతా ఇంతా కాదు.
రష్యా పెట్రోలియం ఉత్పత్తులు కొంటున్నామని మనపై 50 శాతం టారిఫ్‌లతో నెత్తిన బాంబు వేశాడు ట్రంప్. మాట వినకుంటే ఇంకా ఇంకా పెంచుకుంటూపోతామంటూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు. అయితే చైనా-రష్యా-భారత్ బంధం రూపంలో అమెరికాకు వెన్నులో వణుకుపుట్టడంతో పరిస్థితిలో మార్పులొస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కోసం చర్చలు మళ్లీ మొదలవడం రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పేరుకు రష్యా పెట్రోలియం ఉత్పత్తుల పేరుతో టారిఫ్‌లు పెంచినా, ఇండియాతో అమెరికా ఆయుధాలు కొనేలా చేయడం, అలాగే అక్కడి వ్యవసాయ ఉత్పత్తులను ఇండియాకు డంప్ చేయడం ట్రంప్ ఫస్ట్ ప్రయారిటీ. భారత్ నుంచి సాఫ్ట్వేర్ ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తులు, జ్యువెలరీ జెమ్స్, వస్త్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు ఎక్కువగా అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి. అక్వా రంగం కూడా చెప్పుకోదగ్గ బిజినెస్. ఇక అమెరికా నుంచి మనం మినరల్ ఫ్యూయల్స్ అయిల్స్, న్యూక్లియర్ రియాక్టర్స్, బాయిలర్స్, ఆర్గానిక్ కెమికల్స్ దిగుమతి చేసుకుంటాం.
ట్రంప్ టారిఫ్స్ తర్వాత అమెరికా ఇండియా ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపారం క్షీణిస్తూ వస్తోంది. జూలైలో 8 బిలియన్ల వ్యాపారం జరిగితే ఆగస్టు నెలలో ఇండియా ఎగుమతులు 6 బిలియన్లకు పడిపోయాయి. రెండు దేశాల మధ్య వ్యాపారం ఇరు దేశాలకు కీలకమే. ఆగస్టులో ఇరుదేశాల మధ్య చర్చలు జరగాల్సి ఉన్నప్పటికీ 50 శాతం టారిఫ్స్‌తో వాయిదా పడుతూ వస్తున్నాయి.
తాజాగా రెండు దేశాల ప్రతినిధులు బ్రెండెన్ లిచ్, రాజేష్ అగర్వాల్ మధ్య జరిగే చర్చలు మున్ముందు మరిన్ని చర్చలకు నాంది పలికే అవకాశాలున్నాయి. అమెరికా భారత్ మధ్య 2024-205లో వాణిజ్యం 131.84 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత మొత్తం ఎగుమతి చేస్తున్న వస్తువుల్లో అమెరికా 18 శాతం వాటా కలిగి ఉంది. దిగుమతుల్లో 6.22 శాతం కలిగి ఉంది. అమెరికాతో భారతదేశ వాణిజ్య లోటు 41.18 బిలియన్ డాలర్లుగా ఉంది.



