అంతర్జాతీయం

Darien Gap: డేరియన్‌ గ్యాప్‌.. 'నరకాన్ని' దాటి అక్రమంగా అమెరికాకు

Darien Gap: కల చెదిరింది.. కథ మారింది. అవును, అగ్రరాజ్యంలో నివసించాలన్న మోజుతో ఉన్న యువతకు కన్నీరే మిగిలింది. అక్రమ వలసదారులపై కన్నెర్ర చేసిన ట్రంప్ సర్కార్.. వలస దారుల చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి మరీ యూఎస్ నుండి గెంటేస్తున్నారు. వలసదారుల్ని ట్రంప్ సర్కార్ వేటాడుతుండగా.. అక్కడి లోకల్స్ వెంటపడి మరీ పట్టిస్తున్నారు. దీంతో యువకుల కలలకు సంకెళ్లు పడుతున్నాయి. దీంతో ఒకప్పటి అమెరికా కల.. ఇప్పుడో ఒక పీడకల లాగా మారింది.

వాస్తవానికి.. అగ్రరాజ్యంలో నివసించాలన్న కోరికతో, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అమెరికాలో అడుగు పెట్టేందుకు అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌.. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే డీపోర్టేషన్‌ ఆపరేషన్‌ చేపట్టి అక్రమ వలసదారుల్లో వణుకు పుట్టిస్తున్నారు. చె ప్పాలంటే.. ఉపాధి కోసం కొందరు, శరణార్థులుగా మరికొందరు.. అగ్రరాజ్యంపై మోజుతో ఎంతో మంది అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా వెళ్లేందుకు ఉన్న అక్రమ దారుల్లో ఒకటైన ‘డేరియన్‌ గ్యాప్‌’ను దాటుతున్నారు. అయితే ..ఈ డేరియన్ గ్యాప్ దాటడమంటే ప్రాణాలతో చెలగాటమనే చెప్పవచ్చు.

కొలంబియా-పనామాల మధ్య ఉన్న దట్టమైన అడవి ప్రాంతమే డేరియన్‌ గ్యాప్‌. 97కిలోమీటర్లు ఉండే ఈ దట్టమైన అడవిలో నిటారైన కొండలు, లోయలు, వేగంగా ప్రవహించే నదులు ఉంటాయి. విషపూరిత పాములు, క్రూరమృగాలు.. అంతేకాదు ఎల్లప్పుడూ ప్రతికూల వాతావరణం, చిత్తడి నేలలతో కూడిన ఈ ప్రాంతంలో రోడ్డు అనే మాటే ఉండదు. అందుకే ఈ ప్రాంతంలో మకాం వేసిన నేరగాళ్లు.. డ్రగ్స్ వ్యాపారం, మానవ అక్రమ రవాణాతోపాటు వలసదారుల దోపిడీకి కేంద్రాలుగా మార్చుకున్నాయి.

అమెరికాలోకి అక్రమంగా తరలించే మానవ అక్రమ రవాణా ముఠా డేరియన్‌ గ్యాప్‌ను ప్రధాన మార్గంగా ఎంచుకుంటాయి. అయితే దీన్ని దాటేందుకు ఏడు నుంచి 15రోజుల సమయం పడుతుంది. వీసా తేలికగా వచ్చే పనామా, కోస్టారికా, ఎల్‌ సాల్వడార్‌, గ్వాటెమాల వంటి మధ్య అమెరికా దేశాలకు తొలుత తీసుకెళ్తాయి. మానవ అక్రమ రవాణా ముఠాల సాయంతో అక్కడి నుంచి మెక్సికో, అటు నుంచి అమెరికాలోకి పంపించే ప్రయత్నం చేస్తాయి. అనారోగ్యం, దాడులు కారణంగా మార్గమధ్యంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతుంటారు. మహిళలపై డ్రగ్స్‌ ముఠాల అఘాయిత్యాలు అనేవి ఇక అనేకం. ఎదిరిస్తే ప్రాణాలు పోయినట్లే.

కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు వేల సంఖ్యలో మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకునేవారు. కానీ.. ప్రస్తుతం ఏటా లక్షలాది మంది డేరియన్‌ గ్యాప్‌ను దాటుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2023లోనే దాదాపు 5లక్షల 2వేల మంది దీన్ని దాటినట్లు అంచనా. గతేడాది మాత్రం కఠిన నిఘా కారణంగా ఈ సంఖ్య 3లక్షలకు తగ్గినట్లు తెలుస్తోంది. వెనెజువెలా, హైతీ, ఈక్వెడార్‌‌తోపాటు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భారత్‌ నుంచి అక్రమంగా వలసవెళ్లే వారు ఈ మార్గాన్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.

ఇక మెరుగైన జీవితం కోసం నిత్యం వేలాది మంది అభాగ్యులు ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ మార్గంలో వెళ్తున్నారు. చివరకు మెక్సికో దాటినా.. అక్కడ అమెరికా దళాల చేతికి చిక్కిపోతుంటారు. ఇలా వెళ్లినవారినే నిర్బంధించి.. తిరిగి వారి స్వదేశాలకు పంపే కార్యక్రమాన్ని అమెరికా కొనసాగిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button