జాతియం

ఉపరాష్ట్రపతి ఎన్నికలపై దృష్టి పెట్టిన బీజేపీ

BJP: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామంతో దేశంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఉపరాష్ట్రపతి పదవికి జగ్‌దీప్ ధన్‌కడ్ రాజీనామా దేశంలో సరికొత్త చర్చకు దారితీసింది. ఈలోగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ఖరారు చేయడంతో భారత చరిత్రలో ఇది రెండవ మధ్యంతర ఉపరాష్ట్రపతి ఎన్నికగా నిలుస్తుంది.

ఇప్పుడు కాబోయే ఉపరాష్ట్రపతి ఎవరు అన్న అంశంపైనే విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం అధికార NDA కూటమికి చెందిన అభ్యర్థే గెలుపొందే అవకాశాలు ఉన్నందున.. ఆ కూటమిలో జరుగుతున్న కసరత్తు ఆసక్తికరంగా మారింది.

తాజాగా జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇదే అంశంపై చర్చించి నిర్ణయాధికారాన్ని కూటమి పెద్దన్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికే అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ నిర్ణయాధికారాన్ని కట్టబెడుతూ తీర్మానం కూడా చేశారు.

అంటే పార్లమెంట్ ఉభయసభల్లో సభా నాయకులుగా ఉన్న ఈ ఇద్దరు ప్రభుత్వ శాసన వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తున్నందున భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ఎన్నుకునే అధికారాన్ని కట్టబెట్టారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం రేపు సాయంత్రం గంటలకు. 6.00కు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో ఎవరున్నారన్న చర్చ ఊపందుకుంది.

ఉపరాష్ట్రపతి ఎన్నిక పార్లమెంట్ ఉభయ సభల ఎంపీలు కలిసి ఓటు వేసే అరుదైన సందర్భాలలో ఒకటిగా నిలుస్తుంది. సెప్టెంబర్ 9న జరగనున్న ఈ ఎన్నిక జరగనుంది. ఇటువంటి ఎన్నికలో పార్టీల సంఖ్యాబలాలు ముఖ్యమైనవి. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఎన్డీఏకు అత్యంత సౌకర్యవంతమైన ఆధిక్యం ఉంది. ఈ పరిస్థితుల్లో అధికార కూటమికి గెలుపు వ్యూహాలను పదనుపెట్టి సంఖ్యాబలాన్ని కూడగట్టాల్సిన అవసరం లేదు.

కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఒక రాజకీయ సందేశాన్ని పంపాల్సి ఉంటుంది. ప్రాంతం, కులం, భావజాల మూలాలు, కూటమి లెక్కలను సమన్వయం చేయడంతో పాటు ఇంకా అనేక సమీకరణాలను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.

పార్లమెంటులో ఎన్డీఏ సంఖ్యాబలాన్ని ఒకసారి పరిశీలిస్తే.. రాజ్యసభలో బీజేపీకి 102 సీట్లు ఉండగా మిత్రపక్షాలైన జేడీ(యూ), ఏఐఏడీఎంకే, తెలుగుదేశం, ఎన్పీఎఫ్,ఇతర మిత్రపక్షాలతో కలిసి మొత్తం 239 సీట్లలో ఎన్డీయే బలాన్ని 132 సీట్లకు చేరింది. రాజ్యసభలో ఏడుగురు నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయడానికి అర్హులు.

సాధారణ పరిస్థితుల్లో నామినేటెడ్ ఎంపీలు అధికారక కూటమికే మొగ్గు చూపుతుంటారు. ఈ సంఖ్యను కూడా కలుపుకుంటే అధికార కూటమి సంఖ్య 139కు చేరుతుంది. మిగతా సభ్యుల్లో అటు అధికార, ఇటు ప్రతిపక్ష కూటముల్లో లేని తటస్థ రాజకీయ పార్టీలకు చెందిన పార్టీల నేతలు కూడా ఉన్నారు. వారిలో కొందరు అధికార కూటమికి మద్దతు పలికే అవకాశాలు సైతం లేకపోలేదు.

ఇక లోక్‌సభలో బీజేపీకి 240 మంది సభ్యులు, మిత్రపక్షాల 53 సీట్లతో కలిపి మొత్తం 542 మందిలో ఎన్డీయే బలం 293కు చేరుతుంది. రెండు సభలు కలిసి ఓటు వేసినప్పుడు, విజయానికి అవసరమైన సింపుల్ మెజారీటీని ఎన్డీయే సులభంగా అధిగమిస్తుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమిలో కాంగ్రెస్ నుంచి 99 లోక్‌సభ ఎంపీలు, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు కలిపినా సరే ఎన్డీఏ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం కష్టమే.అయినా కూడా తమ ఐక్యతను చాటి చెప్పాలని యోచిస్తోంది.

ఈసారి ఉపరాష్ట్రపతి పదవికి కచ్చితంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ నేపథ్యం కలిగినవారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యం లేనివారికి పదవులు ఇచ్చినప్పుడు వారు పార్టీపై కృతజ్ఞత, విధేయతను ప్రదర్శించకుండా విమర్శకులుగా మారి పార్టీని ఇరకాటంలో పడేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు సత్యపాల్ మాలిక్‌ను గవర్నర్‌గా చేస్తే ఆయన కేంద్ర ప్రభుత్వంపైనే తీవ్రమైన విమర్శలు, నిరాధార ఆరోపణలు చేసి ఇబ్బందులు సృష్టించారు.

ఆ తర్వాత జగ్‌దీప్ ధన్కడ్ సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా వ్యవహరించారు. అందుకే ఈ రాజ్యాంగ పదవులను ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగి, విధేయతను ప్రదర్శించే వ్యక్తులకే అవకాశం ఇవ్వాలన్న ఆలోచనకు బలం చేకూర్చుతోంది.

గవర్నర్లుగా పనిచేసినవారినో, కేబినెట్ మంత్రులుగా ఉన్నవారినో ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతేకాకుండా వివిధ నేపథ్యాల నుంచి వచ్చినవారు సైతం ఈ పదవిని నిర్వహించారు. మోడీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి తన కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారు.

ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గవర్నర్‌గా పనిచేసిన జగ్‌దీప్ ధన్కడ్‌కు అవకాశం కల్పించారు. కానీ ఈసారి కచ్చితంగా ఈ తరహా నేపథ్యాలు కల్గినవారికే ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని ఊహించే పరిస్థితి లేదు.

ప్రతిపక్షం ఖచ్చితంగా ఒక అభ్యర్థిని నిలబెట్టి, ఎన్డీఏ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని ఒక కథనాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తుంది. ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇండి కూటమి కూడా తమ అభ్యర్థిని ప్రకటించాలని చూస్తోంది.

కానీ ఎన్డీఏ సంఖ్యాబలం కారణంగా, ఈ పోటీ కేవలం పేరుకే తప్ప ప్రతిపక్ష అభ్యర్థి గెలుపు సాధ్యం కాదని ఆ కూటమి నేతలందరికీ తెలుసు. అయితే అధికార కూటమికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించడానికి, తమ ఓటుబ్యాంకును కాపాడుకోడానికి ఈ ఎన్నికలను ప్రతిపక్ష కూటమి ఒక సాధనంగా మార్చుకోవాలని చూస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button