ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో రూ.1,990 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రాష్ట్రంలోని నాలుగు కీలక పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తం 1,990 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
అదే సమయంలో 497 కోట్ల 71 లక్షల అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ను కూడా కేంద్రం మంజూరు చేసింది. విశాఖపట్నం, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులు పట్టణాభివృద్ధికి కొత్త ఊపునివ్వనున్నాయి.
రోడ్లు, డ్రైనేజ్, ట్రాఫిక్ నిర్వహణతో పాటు ఆధునిక పట్టణ సదుపాయాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుల అమలుతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.



