జాతియం

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు రంగం సిద్ధం

జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసనకు రంగం సిద్ధమైంది. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన యశ్వంత్ వర్మపై అభిశంసనకు పాలక, ప్రతిపక్షాల ఎంపీలు సంతకాలు చేశారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే వర్మపై అభిశంసనకు గాను పాలక పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ, విపక్ష నేతలైన సుప్రీయా సూలే సహా పలువులు ఎంపీలు మద్దతు పలికారు. న్యాయ వ్యవస్థలో అవినీతి సహించేది లేదని ఎన్డీఏలోని బీజేపీ, టీడీపీ పార్టీలు స్పష్టం చేశాయి.

నోట్ల కట్టల వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టు కమిటీ జస్టిస్ యశ్వంత్ వర్మపై విచారణ చేసింది. జడ్జీలను తొలగించేందుకు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. జస్టిస్‌ వర్మను తొలగించేందుకు 145 మంది లోక్‌సభ ఎంపీలు స్పీకర్‌కు, 63 మంది రాజ్యసభ ఎంపీలు చైర్మన్‌ ధన్‌కర్‌కు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌గా యశ్వంత్ వర్మ పనిచేస్తున్న సమయంలో ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి కాలిన నోట్ల కట్టలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఆయన్ని లక్నో బెంచ్‌కు మార్చడంతో అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

నోట్ల కట్టల వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వర్మపై రిపోర్ట్ ఇచ్చింది. మరోవైపు తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై సుప్రీంలో త్వరగా విచారణ చేయాలన్న వర్మ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

న్యాయ వ్యవస్థ ముందు తలుపులు మూసుకుపోవడం, ఇటు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానానికి సమయం ఆసన్నం కావడంతో వర్మ రాజీనామా చేస్తారా? లేదంటే ఇంపీచ్‌మెంట్‌ను ఎదుర్కొంటారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు న్యాయచరిత్రలో అభిశంసన తీర్మానంతో పదవి పోగొట్టుకున్న న్యాయమూర్తి భారత చరిత్రలో లేరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button