JEE Main: జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం

JEE Main: జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్షలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 12 లక్షల మందికిపైగా పరీక్ష రాస్తున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు లక్షన్నర మంది అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని నగరాలతోపాటు పలు పట్టణాల్లోనూ పరీక్షా కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసింది.
ఐఐటీ, ఎన్‌ఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత కల్పించేందుకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2025 తొలివిడత ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్-1 పరీక్షలు నిర్వహిస్తారు. ఇక చివరి రోజు జనవరి 30వ తేదీన బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్ 2 పరీక్ష జరుగుతుంది.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలు జరుగుతాయి. రెండు విడతల్లో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా తుది ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన తొలి 2.50 లక్షల మందిని జేఈఈ ఆడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఉంటుంది. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు పొందొచ్చు.
కాగా దేశ వ్యాప్తంగా ఉన్న 31 ఎన్‌ఐటీల్లో గత ఏడాది సుమారు 24 వేలు సీట్లు, 23 ఐఐటీల్లో 17,600, ట్రిపుల్‌ఐటీల్లో దాదాపు 8500 సీట్లు, ఇతర విద్యాసంస్థల్లో 57 వేల సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ జేఈఈ మెయిన్ రాసిన ప్రతి వంద మందిలో నలుగురికి మాత్రమే సీట్లు దక్కుతాయి.



