తిరుమల శ్రీవారి సేవలో సింగర్ స్మిత

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ప్రముఖ గాయని స్మిత తన కొత్త సంగీత ప్రాజెక్ట్ “తత్వమసి” గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ, సమాజంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం మరుగున పడిపోయిన తత్వ గీతాలను మళ్లీ ప్రజల్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ తత్వాలలో భక్తి, అద్వైతం, వైరాగ్యం, సామాజిక చైతన్యం వంటి అంశాలు ప్రతిబింబిస్తాయని, అన్నమయ్య కీర్తనలు కూడా ఇందులో భాగమవుతాయని చెప్పారు. “తత్వమసి” ప్రాజెక్ట్‌ను ఈరోజు, మే 16, 2026 శనివారం అధికారికంగా ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. రాబోయే 100 శనివారాల పాటు ప్రతి శనివారం ఉదయం ఒక కొత్త తత్వ గీతాన్ని విడుదల చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా విడుదలైన తొలి గీతం “మానస సంచరరే”.
“ప్రథమ పాదం” పేరుతో వచ్చిన ఈ పాట అద్వైత భావన, భక్తి తత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఈ పాట పల్లవిని ఆలపించి భక్తులను అలరించారు. కేవలం సంగీతాన్ని వినిపించడం మాత్రమే కాకుండా, ఆ తత్వ గీతాల వెనుక ఉన్న అసలు భావం, వాటిని రచించిన ఉద్దేశం, వాటి అంతరార్థాన్ని నేటి యువతకు, పిల్లలకు కూడా సులభంగా అర్థమయ్యే విధంగా అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. ఇక రాబోయే భాగాలలో వైరాగ్యం, భక్తి, తత్వశాస్త్రం, సామాజిక న్యాయం వంటి విభిన్న అంశాలకు సంబంధించిన తత్వ గీతాలను అందించనున్నట్లు తెలిపారు.



