జాతియం

KP Sharma Oli: నేపాల్‌ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్‌

KP Sharma Oli: నేపాల్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గతేడాది నేపాల్‎లో జరిగిన జెన్ జెడ్ నిరసనలను అక్రమంగా అణిచివేసిన కేసులో ఆ దేశ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్ అయ్యారు. భక్తపూర్‌లోని గుండులో ఉన్న ఆయన నివాసం నుంచి పోలీసులు ఓలీని అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఓలీ శర్మతో పాటు నేపాల్ మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్‎ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ ప్రధానిగా బాలెన్ షా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటే రోజే ఈ అరెస్టులు జరగడం నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.

2025లో దేశవ్యాప్తంగా జరిగిన జెన్ జెడ్ నిరసనలను అణచివేశారనే ఆరోపణలకు సంబంధించిన క్రిమినల్ కేసులో కేపీ శర్మ ఓలీ, రమేష్​లేఖక్‎ను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. జెన్-జెడ్ నిరసనల సమయంలో పోలీసుల కాల్పుల వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి బాలెన్ షా అధ్యక్షతన జరిగిన మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే విచారణ కమిషన్ నివేదికను అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

ఆ నిర్ణయం ఆధారంగానే ఈ అరెస్టులు జరిగాయి. ఓలీ అరెస్టుపై కొత్తగా బాధ్యతలు స్వీకరించిన హోం వ్యవహారాల మంత్రి సుడాన్ గురుంగ్ స్పందించారు. జెన్ జెడ్ నిరసనల అణిచివేత కేసులో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ, రమేష్ లేఖక్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. తద్వారా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. ఇది ఎవరిపైనా ప్రతీకారం కాదని.. న్యాయానికి నాంది అని అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. తప్పు చేసిన ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని తెలిపారు.

2025 సెప్టెంబర్‎లో నేపాల్‎లో అప్పటి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వ అవినీతి, దేశంలో సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా జెన్ జెడ్ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. జెన్ జెడ్ యువత రోడ్డెక్కి దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు. ఈ నిరసనలను అణిచివేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో దాదాపు 80 మంది యువకులు మరణించారు. వందల సంఖ్యలో యువత గాయపడ్డారు.

ఈ పరిణామాలతోతీవ్ర ఆగ్రహానికి గురైన జెన్ జెడ్ యువత దేశ పార్లమెంటు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. ప్రజాప్రతినిధుల ఇండ్లపై దాడులు చేశారు. ప్రాణ భయంతో ప్రజాప్రతినిధులు దేశం విడిచి పారిపోయారు. జెన్ జెడ్ యువత నిరసనల దెబ్బకు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ క్రమంలో 2026 మార్చిలో నేపాల్ పార్లమెంట్ కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ర్యాపర్ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన 35 ఏళ్ల బాలెన్ షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం సాధించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button