పరాశక్తి వివాదంతో సుధా కొంగర ఫైర్!

సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన పరాశక్తి సినిమా పొంగల్ రిలీజ్‌తో పాటు వివాదాల మధ్య చిక్కుకుంది. ఫస్ట్ షో నుంచే బాడ్ టాక్ వచ్చిన ఈ చిత్రం రాజకీయంగా కూడా విమర్శలకు గురైంది. తమిళనాడు యూత్ కాంగ్రెస్ సినిమాపై బ్యాన్ డిమాండ్ చేస్తూ రంగంలోకి దిగింది. సెన్సార్ బోర్డు 25 కట్స్ సూచించిన ఈ చిత్రం ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ టార్గెట్ అవుతోందని దర్శకురాలు సుధా కొంగర ఆరోపించారు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
శివకార్తికేయన్ హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన పరాశక్తి సినిమా జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం 1960ల తమిళనాడులో జరిగిన హిందీ భాష వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో రూపొందిన చారిత్రక రాజకీయ యాక్షన్ డ్రామా. శివకార్తికేయన్, రవి మోహన్, అథర్వా మురళి, శ్రీలీల తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా 1952లో విడుదలైన శివాజీ గణేశన్ ఐతిహాసిక ‘పరాశక్తి’కు సంబంధం లేకుండా, DMK భావజాలాన్ని ప్రతిబింబించేలా తీసినట్లు విమర్శలు ఎదుర్కొంది.
విడుదలకు ముందు సెన్సార్ బోర్డు (CBFC) చివరి నిమిషంలో 25 కట్స్ సూచించింది. కొన్ని సన్నివేశాలను ఫిక్షనల్‌గా గుర్తించి, చివరికి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. దర్శకురాలు సుధా కొంగర రివైజింగ్ కమిటీని ఆశ్రయించి మార్పులు చేసి, తన టీమ్ తో 70 గంటలు నిద్రపోకుండా, చాలా కష్టపడి పనిచేసి సినిమాను సమయానికి రిలీజ్ చేసింది. సినిమాలో కొన్ని మాటలు తొలగించాల్సి వచ్చింది. దీంతో ఒరిజినల్ షెడ్యూల్ జనవరి 14 నుంచి ముందుకు తీసుకొచ్చి జనవరి 10న సినిమాను విడుదల చేశారు.
కానీ ఇంత కష్టపడ్డా కూడా ఫలితం దక్కలేదు. మొదటి షో నుంచే సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చింది. ఐడియాలజీ బాగుంది కానీ క్రాఫ్ట్ మాత్రం వెనక్కి జరిగిందని, ఎడిటింగ్‌లో ల్యాగ్స్ ఉన్నాయని, స్టోరీ ఫ్లో బాగాలేదని సోషల్ మీడియాలో రివ్యూలు చెప్పాయి. అయితే హిందీ ఇంపోజిషన్ ఉద్యమాన్ని బలంగా చూపించారని, భావోద్వేగాలు బాగున్నాయని మరికొందరు ప్రశంసించారు. ఫస్ట్ డే వరల్డ్‌వైడ్ సుమారు 27 కోట్లు, ఇండియాలో నెట్ 11-12 కోట్ల మధ్య వసూళ్లు సాధించినట్లు అంచనాలు వచ్చాయి, కానీ తర్వాత రోజుల్లో వసూళ్లలో చాలా డ్రాప్ కనిపించింది.
దీనికి తోడు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. తమిళనాడు యూత్ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు అరుణ్ భాస్కర్ సినిమాను తీవ్రంగా విమర్శించారు. ఇది ప్రో-DMK, హిందూ వ్యతిరేక వైఖరి కనబరిచిందని ఆరోపించారు. 1965 హిందీ వ్యతిరేక ఉద్యమం, పోస్టాఫీసు ఫారాలు హిందీలో మాత్రమే ఉన్నాయని చూపడం, ఇందిరాగాంధీ సందర్శనలు, కోయంబత్తూర్ ఘటనలు తప్పుగా చిత్రీకరించారని విమర్శించారు. క్లైమాక్స్‌లో ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, కామరాజ్ వంటి ప్రముఖుల రియల్ ఫోటోలతో కాంగ్రెస్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని, పోలాచీలో 200 మంది తమిళులు చనిపోయారని చూపడం ఫిక్షనల్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాను బ్యాన్ చేయాలని, అభ్యంతర సన్నివేశాలు తొలగించి పబ్లిక్ అపాలజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఫిక్షనల్ సన్నివేశాలు చట్టవిరుద్ధమని, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ డిస్టార్ట్ చేశారని కాంగ్రెస్ వాదించింది. దీంతో ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.
ఇక పుండుమీద కారం చల్లినట్టు పరాశక్తి పరిస్థితి కూడా అలా తయారయ్యింది. దర్శకురాలు సుధా కొంగర ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ ఐడీలతో నెగెటివ్ ప్రచారం, స్లాండర్, డిఫమేషన్ జరుగుతున్నాయని, దారుణమైన పోస్టులు, రౌడీయిజం, గూండాయిజం లాంటి మాబ్ కల్చర్‌తో పోరాడుతున్నామని అన్నారు. విజయ్ నటించిన జన నాయగన్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడం, పరాశక్తిని ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ పంపిణీ చేయడం వల్ల రాజకీయ కుట్ర జరిగిందని విజయ్ ఫ్యాన్స్ భావిస్తున్నారని, దీంతో టార్గెటెడ్ నెగెటివ్ క్యాంపెయిన్ జరుగుతోందని ఆరోపించారు. “అపాలజీ సర్టిఫికెట్ తీసుకోండి, అప్పుడే సినిమా రన్ అవుతుంది” అనే పోస్టులను ఉదహరించారు. ఇది ఒక నటుడి ఫ్యాన్స్ నుంచి వస్తున్న దాడి అని స్పష్టం చేశారు.
ఇలా ఈ సినిమా రాజకీయ భావజాలాల మధ్య చిక్కుకుంది. ఒకవైపు DMK అనుకూలంగా హిందీ ఇంపోజిషన్‌ను బలంగా చూపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్‌ను తప్పుగా చిత్రీకరిస్తుందని విమర్శలు వస్తున్నాయి. సెన్సార్ కట్స్, రాజకీయ ఆరోపణలు, విజయ్ vs శివకార్తికేయన్ ఫ్యాన్ వార్స్ మధ్య ఈ సినిమా వివాదాస్పదమైంది. మొత్తానికి ఈ సినిమా, తమిళ సినిమా-రాజకీయాల మధ్య ఉన్న బంధాన్ని మరోసారి హైలైట్ చేసింది. శివకార్తికేయన్ ఈ వివాదాలపై స్పందిస్తూ ప్రొపగాండా కాదని, సినిమా పూర్తిగా చూస్తే అర్థమవుతుందని చెప్పారు. ఈ వివాదాల మధ్య పరాశక్తి బాక్సాఫీస్ వద్ద ఎలా సాగుతుందో, దాని హిస్టారికల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడాలి. ఏది ఏమైనా సినిమా ద్వారా చరిత్రను చూపడం అనేది ఎల్లప్పుడూ వివాదాస్పదమే అని మరోసారి నిరూపితమైంది.



