గ్రీన్‌ల్యాండ్ విలీనం కోసం బిల్లుపెట్టిన అమెరికా

గ్రీన్‌లాండ్‌ను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చే అంశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది. ఈ మేరకు అమెరికా యూఎస్ కాంగ్రెస్‌లో ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్‌లో రిపబ్లికన్ సభ్యుడు రాండీ ఫైన్ “గ్రీన్‌లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్‌హుడ్ యాక్ట్” అనే పేరుతో ఈ బిల్లును పెట్టారు.
ఈ బిల్లు చట్టంగా మారితే, గ్రీన్‌లాండ్‌ను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చే నిర్ణయాలు తీసుకునే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది. గ్రీన్‌లాండ్‌ను అమెరికా ప్రాంతంగా చేసుకునేందుకు ఇతర దేశాలతో చర్చలు జరపడం, అవసరమైన చర్యలు తీసుకోవడం వంటి అధికారాలు కూడా అధ్యక్షుడికే ఉంటాయి. ఆ తర్వాత గ్రీన్‌లాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించే ప్రక్రియ మొదలవుతుంది.
ప్రస్తుతం గ్రీన్‌లాండ్ డెన్మార్క్‌కు చెందిన స్వయంపాలక ప్రాంతంగా ఉంది. ఈ బిల్లుతో అమెరికా బలవంతంగా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై డెన్మార్క్, గ్రీన్‌లాండ్ నాయకులు స్పష్టంగా స్పందించారు. తమ భూభాగ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే హక్కు గ్రీన్‌లాండ్ ప్రజలకే ఉందని వారు తెలిపారు.
ఈ బిల్లు చట్టంగా మారాలంటే ముందుగా అమెరికా కాంగ్రెస్‌లో పూర్తి ఆమోదం పొందాలి. ఆ తర్వాతే అది అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు, గ్రీన్‌లాండ్ ప్రజల సమ్మతి లేకుండా ఈ చట్టాన్ని అమలు చేయడం సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలతో అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి.



