Pawan Kalyan: పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిర్వహించిన ప్రసంగంలో ఆసక్తికర అంశాలు.. పిఠాపురాన్ని ఆదర్శవంతమైన ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, నియోజకవర్గ వ్యాప్తంగా గతేడాది పిఠాపురం అభివృద్ధికి రూ.308 కోట్లు ఖర్చు చేశా అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది సంపాదన కోసం కాదని, ఒకవేళ డబ్బు కావాలనుకుంటే సినిమాల్లో నటించి సంపాదించుకోగలనని ఆయన తన నిబద్ధతను చాటుకున్నారు.
రాజకీయాల్లో ఒక కూటమిని నిర్మించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని అని, అయితే దానిని విచ్ఛిన్నం చేయడం చాలా సులభమని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు మరమగ్గాలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ‘తల్లికి వందనం’ పథకం ద్వారా దాదాపు 62.27 లక్షల మంది విద్యార్థులకు రూ. 10 వేల కోట్ల ఆర్థిక సాయం చేశాం అన్నారు.
సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలను, నెగటివ్ వార్తలను వైరల్ చేస్తున్న తీరుపై పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో పిల్లల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలకు కూడా కులం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. విపక్ష సభ్యులు తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా, తన నియోజకవర్గంలోకి వచ్చి విమర్శలు చేయడంపై ధ్వజమెత్తారు. పిఠాపురంలో శాంతిభద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదని పవన్ హెచ్చరించారు. తనతో సహా ఎవరూ వ్యవస్థలకు అతీతులు కారన్నారు. చట్టాన్ని అతిక్రమించే వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గోదావరి జిల్లాల సంస్కృతిలో మార్పు రావాలని పవన్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ అంటే కేవలం కోడి పందాలు, పేకాట, కోట్ల రూపాయల జూదం అనే ముద్ర పోవాలని ఆయన పిలుపునిచ్చారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రజలకు గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని రుచి చూపించాలని, పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. తాను పేరాంటాలకు, వేడుకలకు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నానని కొందరు విమర్శిస్తున్నారని, అయితే తన దృష్టి ఎప్పుడూ ప్రజల సంక్షేమం, అభివృద్ధిపైనే ఉంటుందని ఆయన వివరణ ఇచ్చారు.



