Zelensky: భద్రతా హామీలు ఇస్తే నాటో సభ్యత్వాన్ని వదులుకుంటాం

Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ శాంతి చర్చల కోసం కీలకమైన వైఖరిని ప్రకటించారు. నాటోలో చేరాలనే ఉక్రెయిన్ లక్ష్యాన్ని వదులుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. అయితే రష్యా నుంచి భవిష్యత్తులో దాడులు జరగకుండా నిరోధించడానికి నాటో సభ్య దేశాల తరహాలో పశ్చిమ దేశాల నుంచి కచ్చితమైన భద్రతా హామీలను కోరుతున్నట్లు అమెరికా రాయబారులతో జరిగిన చర్చల్లో ఆయన స్పష్టం చేశారు. మరోవైపు డొనెట్స్క్ ప్రాంతాన్ని వదులుకునే అమెరికా ప్రతిపాదనను మాత్రం ఆయన తిరస్కరించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ రష్యా యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమని ప్రకటిస్తూ కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రష్యా నుంచి భవిష్యత్తులో దాడులు జరగకుండా పశ్చిమ దేశాల నుంచి భద్రతా హామీలు లభిస్తే.. తమ దేశం నాటో కూటమిలో చేరాలనే ప్రయత్నాన్ని విరమించుకోవడానికి సిద్ధమని ఆయన బెర్లిన్లో ప్రకటించారు.
ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 28 పాయింట్ల ప్రణాళికను తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీన్ని జెలెన్స్కీ వ్యతిరేకించగా ఇరు దేశాల మధ్య గత కొన్ని వారాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.



