ఢిల్లీ పేలుళ్లు.. అల్ ఫలాహ్ యూనివర్సిటీ సభ్యత్వం రద్దు

అల్ఫలాహ్ యూనివర్సీటీ… ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఇది. ఒకప్పుడు ప్రతిష్ఠాత్మక జామియా, అలీగఢ్ విశ్వవిద్యాలయాలకు ప్రత్యామ్నాయంగా కన్పించిన అల్-ఫలాహ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు చాలామందికి తెలియని ఈ యూనివర్సిటీ పేరు ఇప్పుడు అందరి నోళ్లలో ఎందుకు నానుతోంది.. ? ప్రతీ ప్రతికల పతాక శీర్షికలకు ఎక్కుతోంది ఎందుకు..? ఈ యూనివర్సిటీ సభ్యత్వం రద్దు చేయడానికి గల కారణాలేంటి..?
ఒకప్పుడు ఏ గ్రేడ్ అందుకున్న ఈ కాలేజీ ఇప్పుడు ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మారింది. వైద్యులు, ఉపాధ్యాయుల ముసుగులో ఈ విశ్వవిద్యాలయాన్ని కొందరు తమ ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో గల ధౌజ్ గ్రామంలో దాదాపు 70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ విశ్వవిద్యాలయం 1997లో ఇంజినీరింగ్ కళాశాలగా ప్రారంభమైంది.
2013లో యూజీసీకి చెందిన నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నుంచి ఏ గ్రేడ్ అందుకుంది. 2014లో హర్యానా ప్రభుత్వం దీనికి యూనివర్సిటీ హోదాను కల్పించింది. ఆ తర్వాత ఇదే యూనివర్సిటీకి అనుబంధంగా 2019లో అల్-ఫలాహ్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి ఎంబీబీఎస్ కోర్సులను ప్రారంభించారు. ఆ తర్వాత 2023లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను కూడా స్టార్ట్ చేసింది. ఈ యూనివర్సిటీ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీకి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
అల్ ఫలాహ్‌లో 650 పడకలతో కూడిన ఓ చిన్న ఆసుపత్రి కూడా ఉంది. ఇక్కడ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తారు. క్యాంపస్‌లో ఐదు బ్యాచ్‌లుగా ఎంబీబీఎస్ కోర్సులు అందిస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 150-200 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ యూనివర్సిటీని అల్ ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్ 1995లో ఏర్పాటైంది. ఈ యూనివర్సిటీతో పాటు కొన్ని మదర్సాలు, అనాథ శరణాలయాలు, స్కూళ్లు, ఇతర ఛారిటీ సంస్థలు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ యూనివర్సిటీకి జావెద్ అహ్మద్ సిద్దిఖీ ఛాన్స్‌లర్‌గా ఉన్నారు.
అల్-ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్ట్‌కి మేనేజింగ్ ట్రస్టీకూడా ఆయనే. అంతేకాదు అల్-ఫలాహ్‌కు చెందిన పలు కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆయనే. అల్-ఫలాహ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, అల్-ఫలాహ్ ఎడ్యుకేషన్ సర్వీస్, అల్-ఫలాహ్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్, అల్-ఫలాహ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అల్-ఫలాహ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, టార్బియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, అల్-ఫలాహ్ ఎనర్జీస్ లిమిటెడ్ సహా పలు సంస్థలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడెందుకు ఈ యూనివర్సిటీ గురించి చెప్పుకుంటున్నామంటే ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించిన కేసులో అరెస్టైన నిందితులతో ఈ యూనివర్సిటీ సంబంధాలు ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో.. ఈ కాలేజీపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ యూనిర్సిటీలో 40 శాతం మంది డాక్టర్లు కశ్మీర్‌కు చెందిన వారేనట. లోకల్ వైద్యులు, విద్యార్థులను కాకుండా ఎక్కువ మంది కశ్మీర్ ప్రాంతానికి చెందిన వారిని తీసుకోవడంపై పలు అనుమానాలకు తావిచ్చింది.
బాయిస్ హాస్టల్ బిల్డింగ్ నం.17, రూం నం.13. ఓ సాధారణ మురికి, నీళ్లు పారుతున్న గది.. మెడికల్ స్టూడెంట్ హాస్టల్.. వైట్ కాలర్ టెర్రరిస్టుల అడ్డా టెర్రర్ మాడ్యుల్ సీక్రెట్ మీటింగ్ పాయింట్ దీంతో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌లో ఇప్పటి వరకూ అరెస్టైన వైద్యులందరూ ఈ వర్సిటీకి చెందిన వారే కావడం కలకలం రేపుతోంది. దీంతో ఈ యూనివర్సిటీని ఉగ్రకార్యకలాపాలకు అడ్డాగా మారిందని అంటున్నారు.
పవిత్రమైన వైద్య వృత్తిని ఎంచుకున్న వీరు ఎంతవరకు సేవ చేశారో తెలియదుగాని ఉగ్రవాదుల అవతారం ఎత్తారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నారు. దేశంలో బాంబు పేలుళ్లకు, విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న వైట్ కాలర్ ఉగ్ర మాడ్యుల్‌ను పోలీసులు ఛేదించి, అదుపులోకి తీసుకున్న పలువురు వైద్యులు ఫరీదాబాద్ లోని అల్ – ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన వారే. వైద్యులు, ఉపాధ్యాయుల ముసుగులో ఈ విశ్వవిద్యాలయాన్ని కొందరు తమ ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నారు. అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో గల ధౌజ్ గ్రామంలో దాదాపు 70 ఎకరాల్లో విస్తరించి ఉంది.
ఓపీ ఇండియా అనే మీడియా సంస్థ చాన్సలర్‌గా ఉన్న జావాద్ అహ్మద్ సిద్ధిఖీయే పెద్ద అవినీతిపరుడని బయటపెట్టింది. అంతేకాదు సోదరుడితో కలిసి మూడేళ్లపాటు తీహార్‌జైల్లో ఉన్నాడు కూడా. జావాద్ ఇండోర్‌లోని దేవి అహల్య విశ్వవిద్యాలయం నుంచి ఇండస్ట్రియల్, ప్రొడక్ట్ డిజైన్‌లో బీటెక్ పూర్తి చేశాడు.అనంతరం జావాద్ కుటుంబం ఢిల్లీకి మకాం మారింది.
ఇక 1993లో జామియా మిలియా ఇస్లామియాలో మెకానికల్ ఇంజనీరింగ్ లెక్చరర్‌గా జావాద్ పని చేయడం ప్రారంభించాడు. ఇక్కడే తన ఆశయాలను నెరవేర్చుకోవడానికి ప్రణాళికలు రచించాడు. జావాద్ లెక్చరర్‌గా పని చేస్తుండగా అల్- ఫలాహ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ను ప్రారంభించాడు. కొద్దికాలంలోనే సంస్థ పురోగతి సాధించింది. ఆయా ప్రాంతాల్లో డజను వెంచర్లు విస్తరించాయి.
విద్యార్థినులకు హిజాబ్‌లు, బుర్ఖాలు ధరింపచేశారు. తీహార్ జైలులో శిక్ష అనుభవించిన వ్యక్తే అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయాన్ని నడుపుతున్న జావాద్ అహ్మద్ సిద్ధిఖీ అని స్పష్టమైంది. వంద ఫ్లాట్స్నిర్మించి వాటిని యజమానులకు ఇవ్వకుండా మోసం చేశాడు. సిద్దిఖీ నెలకొల్పిన కొన్ని కంపెనీలు మూతబడిపోయాయి.
అయితే ఢిల్లీ పేలుడు ఘటన వెనుక అల్ ఫలా యూనివర్సిటీ హస్తం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. కేసులో అరెస్టయిన నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అల్ ఫలా యూనివర్సిటీ స్పష్టంచేసింది. పేలుడు ఘటన తమను కలిచివేసిందని, ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ భూపిందర్ కౌర్ ఆనంద్ అన్నారు. తాము 1997 నుంచి వివిధ విద్యాసంస్థలు నడుపుతున్నామని, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందామని చెప్పారు.
2019 నుంచి తాము ఎంబీబీఎస్ కోర్సులు నిర్వహిస్తున్నామని, తమ దగ్గర వైద్య పట్టా అందుకున్న చాలామంది ప్రస్తుతం ప్రముఖ ఆస్పత్రుల్లో పని చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీ పేలుడు కేసులో తమ యూనివర్సిటీలో పనిచేసే ఇద్దరు డాక్టర్‌లను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందని, వాళ్లు తమవద్ద కేవలం అధ్యాపకులుగా పనిచేస్తున్నారని, అంతకుమించి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.
కాగా ఉగ్రముఠాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో కశ్మీర్లో 2023లో ఆర్టికల్ 311(2)(C) కింద ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. ఆ తర్వాత అతడికి అల్-ఫలాహ్ యూనివర్సిటీలో మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం లభించింది. అయితే ఢిల్లీ పేలుడు తర్వాత అతడు కనిపించకుండా పోయాడని, ప్రస్తుతం అతడి జాడ కోసం గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుండగా, ఇప్పుడు అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఆర్థిక వ్యవహారాలను ఈడీ దర్యాప్తు చేయబోతోంది. ఇదిలా ఉంటే, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయం సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. అన్ని యూనివర్సిటీలు మంచి స్థితిని కొనసాగించినంత వరకు మాత్రమే సభ్యులుగా ఉంటాయని AIU తెలిపింది.
అల్ ఫలాహ్ యూనివర్సిటీ మంచి స్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదని అధికారిక లేఖలో పేర్కొంది. దీంతో AIU విశ్వవిద్యాలయం సభ్యత్వాన్ని తక్షణమే నిలిపివేసింది. దాని ఆపరేషన్లలో పేరు, లోగో ఉపయోగించడం నిలిపేయాలని అసోసియేషన్ సంస్థ ఆదేశించింది. దాని అధికారిక వెబ్‌సైట్ నుండి AIU లోగోను వెంటనే తొలగించాలని అల్-ఫలా విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది.



